మన ద్యాస ప్రతినిధి, సాలూరు :- సత్య సాయి ప్రేమ తత్వం ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందిందని, అందుకే దేశ, విదేశాల్లో సాయి భక్తులు విస్తరించి ఉన్నారని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం ఉదయం ఎంపీడీవో గొల్లపల్లి పార్వతి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో సత్య సాయి శత జయంతి ఉత్సవాలను ఏర్పాటు చెయ్యగా మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. మొదట సాయి చిత్ర పటానికి పూల మాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన కావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి భక్తులు చేసే భజనలో పాల్గొని వారితో పాటు పలు కీర్తనలు ఆలపించారు. అనంతరం డ్వమా పీడీ రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. తోటి వారిలో దైవత్వాన్ని చూడాలనేదే సాయి బోదనల సారాంశమన్నారు. ప్రతీ ఒక్కరూ దీన్ని పాటించాలన్నారు. సత్య సాయి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేసి పేదలకు విద్య, వైదాన్ని అందించారని, సాయి ట్రస్టుకు సాటి దేశంలో మరేది లేదన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో త్రాగు నీరు లేక అలమటిస్తున్న అనంతపురం జిల్లా ప్రజలకు మంచి నీటిని అందించిన మహనీయుడు సత్య సాయి అన్నారు. చంద్రబాబు నాయుడు సాయిని కలిసి అనంతపురం జిల్లా ప్రజల నీటి కష్టాలపై చర్చించారని, ఆ మేరకు దృష్టి పెట్టిన సాయి ఆ జిల్లా వాసులకే కాకుండ రాష్ట్రంలోని పలు జిల్లాలకు త్రాగు నీటిని అందించారని గుర్తు చేసారు. సత్య సాయి 1926నవంబర్ 23వ తేదీన పుటపర్తిలో జన్మించారని, ఆయన తన చిన్న తనం నుండే(14వ ఏట)తోటి వారికి సహాయం చెయ్యటాన్ని అలవాటు చేసుకున్నారన్నారు. ఆయన బాటలో వేలాదిగా భక్తులు నడవటం హర్షణీయమన్నారు. *ప్రశాంతతకు మారు పేరు పుటపర్తి* పుటపర్తి ప్రశాంతతకు మారు పేరని, అక్కడికి వెళ్లాకే ప్రశాంత నిలయం అన్న పేరు ఎందుకు పెట్టారో అర్థమైందని మంత్రి సంధ్యారాణి అన్నారు. 1996లో తన కుటుంబంతో పాటు పుటపర్తి వెళ్లగా తనకు మాత్రమే సాయి దర్శన భాగ్యం కలిగిందన్నారు. అలాగే అక్కడ భక్తుల క్రమ శిక్షణ, వారి సేవా కార్యక్రమాలు, అక్కడ వాతావరణం చూసి ఆశ్చర్య పోయానన్నారు. అందుకే దేశ, విదేశాల్లో సాయి బాబాకి భక్తులు ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా సాయి తత్వాన్ని కలిగి ఉండటం ఆనందదాయకమన్నారు. అదేవిదంగా సాలూరు సత్య సాయి భక్త బృందం చేస్తున్న సేవలు చూస్తే చాలా ఆనందంగా ఉంటుందన్నారు. ఇటీవల జరుపుకున్న శ్యామలాంబ అమ్మవారి పండగలో వీరు అందించిన సేవలను మరువలేమన్నారు. అంతేకాకుండా ప్రతీ ఏటా శివరాత్రి పర్వదినం నాడు పారమ్మ కొండకు వచ్చే భక్తులకు వీరు అందించే సేవలు గూర్చి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. సాయి భక్తులు ఇదే విధంగా ముందుకు సాగాలని, ఎప్పుడు, ఏ అవసరం వచ్చినా తనను కలవాలన్నారు. కార్యక్రమంలో పట్టణ సాయి భక్తులు లాయర్ చలం, లాయర్ గంట అప్పల నాయుడు లతోపాటు టీడిపి మండల అధ్యక్షులు ఆముదాల పరమేశ్, మత్స శ్యాం, భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.
