

Mana Cinema :- నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాల్లో ఆదిత్య 369 కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1991లో విడుదలైంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మోహిని కథానాయికగా నటించగా.. సిల్క్ స్మిత, శుభలేఖ సుధాకర్, గొల్లపూడి మారుతిరావు, చంద్రమోహన్ వంటి ప్రముఖులు కీలకపాత్రలు పోషించారు. హీరో తరుణ్ బాలనటుడిగా కనిపించిన ఈ మూవీ సీక్వెల్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రానికి సీక్వెల్ తప్పక వస్తుందని ఇప్పటికే పలు మార్లు బాలయ్య చెప్పారు. ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో రానున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ఆయన హోస్టింగ్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 కార్యక్రమంలో ఆదిత్య 999 మ్యాక్స్ మూవీ గురించి మాట్లాడారు.అన్‌స్టాపబుల్ సీజన్ 4లో ఆరో ఎపిసోడ్ డిసెంబర్ 6న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రతి ఎపిసోడ్‌కు ముందు బాలయ్య విభిన్న గెటప్స్‌లో వస్తుండగా.. ఆరో ఎపిసోడ్‌లో ముసలి వేషంలో ఉన్న వ్యోమగామి గెటప్‌లో వచ్చారు. ఈ క్రమంలో ఆదిత్య 369 సీక్వెల్ గురించి మాట్లాడారు. ఈ చిత్రంలో ఆయన కుమారుడు మోక్షజ్ఞ హీరోగా నటించనున్నట్లు చెప్పారు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రం గురించి బాలయ్య ఇంకా ఏమని చెప్పారో తెలియాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ వరకు వేచి ఉండాల్సిందే. ఇక ఈ ఎపిసోడ్‌కు అతిథులు శ్రీలీల, నవీన్ పొలిశెట్టిలు వచ్చారు.