

అమరావతి : (మన ద్యాస న్యూస్ ) సెప్టెంబర్ 14 :///
ఇది చాలా అరుదైన దృశ్యం..! బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి దృశ్యం ఎప్పుడూ కనిపించలేదేమో…? సాధారంగా ఐఏఎస్‌కు ఎంపిక కావడమే ఒక గొప్ప. ఐఏఎస్ సాధించడానికి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అవుతారు…చాలా కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతారు. అలా విజయం సాధించిన వారికి కలెక్టర్‌గా పనిచేసే అవకాశం రావడం..వారి జీవితంలో మరిచిపోలేని రోజు. ఒక జిల్లాకు కలెక్టర్‌గా పనిచేయడం ఐఏఎస్ సాధించిన వారికో గొప్పగౌరవం. అయితే..ఇప్పుడు ఇలా ఐఏఎస్ సాధించి వివిధ హోదాలో పనిచేసిన ఇద్దరు ఐఏఎస్ భార్యాభర్తలు..ఒకే రోజు ఇద్దరూ కలెక్టర్లుగా ప్రమాణస్వీకారం చేయడం మరింత అరుదైన దృశ్యమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ…విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కానీ..ఇటువంటి దృశ్యాలు ఎప్పుడూ కానరాలేదు. భార్యాభర్తలు ఐఏఎస్‌లు అయి కలెక్టర్లుగా కొందరు పనిచేసి ఉండవచ్చు. కానీ..ఒకే రోజు భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరు జిల్లాలకు కలెక్టర్లుగా పదవీస్వీకారం చేయడం మాత్రం చాలా అరుదైన సంఘటనే. అటువంటి సంఘటనే ఈరోజు జరిగింది. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా హిమాన్ష్‌శుక్లా ఈరోజు పదవీబాధ్యతలు చేపట్టగా ఆయన సతీమణి కృతికాశుక్లా ఈరోజే పల్నాడు జిల్లా కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇద్దరూ ఒకే రోజు కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టడం వారి కుటుంబంతోపాటు, బంధువులను స్నేహితులతో 2013 బ్యాచ్‌కు చెందిన ఈ భార్యాభర్తలు ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కాగా మరొకరు హర్యానాకు చెందిన వారు. వీరు రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్లుగా, కలెక్లర్లుగా, హెచ్ఒడిలుగా, ఇంకా ఇతర శాఖలకు అధిపతులుగా పనిచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లుగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించడంతో వీరిద్దరికీ ఒకేసారి కలెక్టర్లుగా పనిచేసే అరుదైన అవకాశం లభించింది. తమకు వచ్చిన అవకాశంతో పేదలకు సేవచేస్తామని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమపై పెట్టిన బాధ్యతలకు న్యాయం చేస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా రాజకీయంగా సున్నితమైన నెల్లూరు జిల్లాలో హిమాన్ష్ శుక్లా పని కత్తిమీదసాములాంటిదే. అయితే..వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ఇక్కడ కూడా విజయవంతం అవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్యాక్షన్ రాజకీయాలకు నిలయమైన పల్నాడు జిల్లాలో ఆయన భార్య కృతికాశుక్లాకు పలు ఛాలెంజ్‌లు ఎదురుకానున్నాయి. జిల్లా మొత్తం టిడిపి ఎమ్మెల్యేలే ఉన్న ఈ జిల్లాలో కలెక్టర్‌గా పనిచేయడం సవాల్‌తో కూడుకున్నదే. ఏది ఏమైనా..దంపతులు ఇద్దరూ..ఒకేసారి కలెక్టర్లుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైనం..మీడియాలో హైలెట్ అవుతోంది.