

మన న్యూస్,తిరుపతి :– విద్యార్థులు చిన్నప్పటినుండే చదువుతోపాటు క్రీడలను అలవర్చుకోవాలని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ విద్యార్థులకు సూచించారు. గురువారం ముత్యాల రెడ్డి పల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ కు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలను ఎంతసేపు చదవమని చెప్పకుండా వారికి క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా చూడాలన్నారు. విద్యార్థులు గురువుల పట్ల గౌరభావంతో పాటు భక్తి భావం కలిగి ఉండాలని అప్పుడే విద్యార్థులకు చదువు వంట పడుతుందని పేర్కొన్నారు. హైస్కూల్లో విద్యార్థులకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పరచాలని, మధ్యాహ్న భోజన పథకంలో మంచి నాణ్యత కలిగి ఉండాలన్నారు. పిల్లలకు తాగేందుకు అవసరమైన తాగునీరు మినరల్ వాటర్ తో పాటు మరుగుదొడ్లు పరిశుభ్రముగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడులకు కావలసిన వసతులను సమకూరుస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ల ప్రోత్సాహంతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను నెంబర్ వన్ గా తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. హై స్కూల్ లోని మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు.