

పిఠాపురం మే, 16 మన న్యూస్ :పిఠాపురం మండల పరిధిలోని ఎఫ్.కె.పాలెం గ్రామంలో గల పాపిడి దొడ్డి చెరువులో కొందరు ఇటుక బట్టీల వ్యాపారులు అక్రమంగా మట్టిని తరలించకపోయేందుకు ఇప్పటికే సిద్ధపడ్డారని, యంత్రాలను అడ్డుకొని అక్రమ తవ్వకాలను నిలుపుదల చేయించామని స్థానిక రైతులు తెలిపారు. అయినా బట్టి వ్యాపారులు తమ ప్రయత్నాలను నిలుపుదల చేయకపోవడంతో శుక్రవారం పాపిడిదొడ్డి చెరువు వద్ద రైతులు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. అర్థనగ్న ప్రదర్శన ద్వారా తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు జవ్వాది కృష్ణ మాధవరావు, ముమ్మిడి వెంకన్న బాబు, మలిరెడ్డి పల్లపురాజు, రెడ్డి సత్యనారాయణ, జీను స్వామి, ఎఫ్.కె. పాలెం కందరాడ గ్రామాల సర్పంచులు ముమ్మిడి శేఖర్, సైతన ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ తమ వ్యాపార స్వలాభాల కోసం కొందరు ఇటుకుల బట్టి వ్యాపారులు గ్రామంలోని చెరువులో ఉన్న మట్టిని అక్రమంగా తరలించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఒక రైతు పేరుతో అనుమతి తీసుకుని పెద్ద ఎత్తున మట్టిని తరలించేందుకు రెడీ అయ్యారన్నారు. గ్రామానికి చెందిన సుమారు 300 మంది రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చెరువు పెద్ద పెద్ద గోతులతో ఉండగా సాగునీరు సక్రమంగా అందడం లేదన్నారు. మళ్ళీ గనుక చెరువులో మట్టి తవ్వకాలు జరిగితే ఏటా రైతులు భారీగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తమ సమస్యను గుర్తించి చెరువులో మట్టి తవ్వకాలను తక్షణమే నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఒక మహిళా రైతు పేరుతో అనుమతి తీసుకుని ఆ రైతుకు సంబంధం లేకుండా మట్టి మాఫియా వారు తమ బట్టీలకు మట్టిని తరలించుకొనేందుకు అధికారులను సైతం తమ వైపునకు తిప్పుకున్నారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. రైతుల సమస్యలను కాదని మట్టిని గనుక తరలిస్తే యంత్రాలను అడ్డుకుని తీరతామని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడి చక్రర్రావు, వెన్నా అర్జునరావు, కర్రిపోతుల నల్లయ్య, కృష్ణ, మత్య దొంగబ్బాయి, మత్య చిన్నోడు, సామిదాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.