యాదమరి, మన ధ్యాస డిసెంబరు-17 యాదమరి మండలంలోని విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయాలనే లక్ష్యంతో మండల స్థాయి సైన్స్ ప్రదర్శనను యాదమరి ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలు, ప్రాధమికోన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు తమ వినూత్న శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలతో పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి హెచ్.ఎల్.ఎన్. ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఇలాంటి సైన్స్ ప్రదర్శనలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధనాత్మక ఆలోచనలను పెంపొందిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఇవి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. మొత్తం 40 సైన్స్ ప్రదర్శనలు నిర్వహించగా, వాటిలో ప్రతిభ కనబరిచిన 9 మంది విద్యార్థులను ఈ నెల 19న జరగనున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక చేసినట్లు మండల ఇన్‌చార్జి ఎంఈఓ ప్రసాద్ వెల్లడించారు. ఈ ప్రదర్శన విజయవంతంగా నిర్వహించడంలో హెచ్.యం హేమలత కీలక పాత్ర పోషించారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు యం. విజయకుమార్, కె.గొల్లపల్లె ఇన్‌చార్జి జె. భాస్కర్ రెడ్డి, కె. కనకాచారి, షణ్మగం, సుధ, హేమాద్రి బాబు, మురళి, తులసిప్రసాద్, రాణి, శైలజ, విజయకుమార్, షబానా తదితర ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో ఈ మండల స్థాయి సైన్స్ ప్రదర్శన విజయవంతంగా ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *