

మన న్యూస్ యాదమరి ఆగస్ట్-20
ఈరోజు యాదమరి మండలంలో వివిధ పాఠశాలలను సందర్శించి రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టియూ) సభ్యత్వ స్వీకరణ, ఉపాధ్యాయుల సమస్యల సేకరణ కార్యక్రమము నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ఎస్టియూ చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయులకు సుమారు 25 వేల కోట్ల ఆర్థిక బకాయిలను వెంటనే దశలవారీగా చెల్లించాలని, ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న డీఏ లను మంజూరు చేయాలని, 12 వ పిఆర్సి కమిషన్ చైర్మన్ ను నియమించి 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఆలస్యం చేయకుండా ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న మెమో 57 ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసి 2003 డీఎస్సి ద్వారా నియామకం పొందిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, అలాగే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయడమైనది. అలాగే ఇటీవల పాఠశాలలో అమలు చేస్తున్న నూతన మూల్యాంకన విధానం రద్దు పరచాలని డిమాండ్ చేశారు. దీనివలన పాఠశాలలో ఎక్కువ సమయం విద్యార్థులకు పాఠాలు బోధించే వీలు లేకుండా మూల్యాంకన పుస్తకాలను విద్యార్థులచే రాయించడంలో సమయం వృధా అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు యాదమరి మండల శాఖ అధ్యక్షులు విశ్రాంత ఉపాధ్యాయులు గుణశేఖర్, యాదమరి మండల శాఖ ప్రధాన కార్యదర్శి రమేష్ మరియు సంఘ నాయకులు సుబ్రహ్మణ్యం పిల్లె, రంగనాథం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
