

మన న్యూస్ చిత్తూర్ జులై-27 ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమం ప్రభుత్వం బాధ్యతగా భావించి, తక్షణం ఉపశమన చర్యలు చేపట్టాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ( ఎస్.టి.యు) రాష్ట్ర అసోసియట్ అధ్యక్షులు గంటా మోహన్ డిమాండ్ చేశారు
ఆదివారం ఉదయం చిత్తూరు లోని ఎస్.టి యు జిల్లా కార్యాలయంలో, సంఘ జిల్లా కార్య నిర్వాహకవర్గ సమావేశం, జిల్లా అధ్యక్షులు మదన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ముఖ్య అతిథిగా గంటా మోహన్ మాట్లాడుతూ, లేదు లేదంటూనే ఉపాధ్యాయులను బోధనేతర పనుల్లో ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు భత్యం బకాయిలు విడుదల చేయాలని, వేతన సవరణ కమిటీ చైర్మెన్ ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమం ఖచ్చితంగా ఉండాలన్నారు.
ఎస్.టి.యు జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వివిధ రకాల యాప్ లు, ప్రొఫార్మాల పేరుతో వివరాలు అప్లోడ్ చేయడానికే బోధనా సమయం హరించుకు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చెందినవారు ఆర్థిక ప్రయోజనాలు అందక ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. 2003 డి ఎస్సీ టీచర్లకు పాతపెన్షన్ విధానం వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి బోడే మోహన్ యాదవ్ మాట్లాడుతూ, సర్దుబాట్లు, బదిలీలు కారణంగా స్థానచలనం పొందిన టీచర్లకు వెంటనే జీతాలు చెల్లించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులకు పదోన్నతులు ఇవ్వాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ చేపట్టే పరిస్థితి రాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్య క్రమంలో సంఘ నాయకులు చిట్టిబాబు, బొబ్బిలి, సుబ్రహ్మణ్యం, లక్ష్మీపతి, ఫల్గుణ మునిరాజు, ఆనందయ్య, గణేష్, జార్జ్, ఢిల్లీ బాబు, గోవింద ప్రసాద్, మధుబాబు, చేతన్, కిషోర్, శ్రీనివాసులు, రాధా కుమారి, ప్రహసిత్ తదితరులు పాల్గొన్నారు.