

గొల్లప్రోలు ఏప్రిల్ 23 మన న్యూస్ :- అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న వీఆర్వో పై గ్రావెల్ మాఫియా దాడి చేసిన ఘటన గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు పరిశీలిస్తే.. మండల పరిధి చెందుర్తి శివారులో గడచిన కొంత కాలంగా ప్రభుత్వ భూముల్లో అక్రమార్కులు క్వారీ ఏర్పాటు చేసి అర్ధరాత్రి సమయాల్లో గ్రావెల్ తరలిస్తున్నారు. యధా ప్రకారం ఆదివారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన కొంతమంది క్వారీ ఏర్పాటు చేసి ట్రాక్టర్లు ద్వారా గ్రావెల్ తరలిస్తున్నారు.చెందుర్తి నుండి ఇతర ప్రాంతాలకు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నట్లు స్థానిక వీఆర్వో పద్మ శేఖర్ కు సమాచారం అందింది.ఈ మేరకు సోమవారం తెల్లవారు జామున పోలీసులకు సమాచారం అందించిన విఆర్ఓ క్వారీ నిర్వహిస్తున్న ప్రాంతానికి వెళ్ళగా అక్కడ అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్లను గుర్తించి అడ్డుకున్నారు.అనంతరం తహసిల్దార్,పోలీసులకు వాహనాలు పట్టుకున్న విషయాన్ని తెలిపి గ్రావెల్ ట్రాక్టర్లను తీసుకుని వెళ్లవలసిందిగా కోరారు.అదే సమయంలో క్వారీ నిర్వాహకుడు,మరికొందరు అక్కడికి వచ్చి వాహనాలను విడిచిపెట్టాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. అక్రమార్కులు బెదిరింపులకు దిగినప్పటికీ లెక్క చేయకపోవడంతో ఒంటరిగా ఉన్న వీఆర్వో పద్మ శేఖర్ పై దౌర్జన్యానికి దిగి వాహనాలు విడిపించుకుని పోయారు. తహసిల్దార్,పోలీసులు వచ్చే వరకు వాహనాలు విడిచి పెట్టేది లేదని వీఆర్వో స్పష్టం చేయడంతో ఆగ్రహించిన అక్రమార్కులు వీఆర్వో ను బలవంతంగా పక్కకు నెట్టి వేశారు.మరోసారి క్వారీ ప్రాంతానికి వస్తే అంతు చూస్తామని తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారు. జరిగిన విషయాన్ని తన పై అధికారులకు తెలపడంతో పాటు మండల పరిధిలో ఇతర విఆర్వోలతో కలిసి పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కు గ్రావెల్ మాఫియా దౌర్జన్యం పై పద్మ శేఖర్ ఫిర్యాదు చేశారు. వీఆర్వో పై బహిరంగంగా దాడి జరిగినప్పటికీ ఇంత వరకు ఎటువంటి కేసు నమోదు కాకపోవడం విశేషం
వీఆర్వో పై దాడి వాస్తవమే: తహసిల్దార్
చెందుర్తి గ్రామంలో అక్రమ క్వారీ పరిశీలించేందుకు వెళ్లిన వీఆర్వో పద్మ శేఖర్ పై క్వారీ నిర్వాహకులు దౌర్జన్యానికి దిగిన విషయం వాస్తవమేనని గొల్లప్రోలు తహాసిల్దార్ సత్యనారాయణ తెలిపారు.అర్ధరాత్రి సమయంలో గ్రావెల్ తవ్వకాలు నిర్వహిస్తున్నందున రెవిన్యూ సిబ్బందిపై గ్రావెల్ మాఫియా దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు.తనపై జరిగిన దౌర్జన్యం పై వీఆర్వో పద్మ శేఖర్ తనకు తెలిపారని తహాసిల్దార్ వివరించారు. దాడికి పాల్పడిన అక్రమార్కులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వీఆర్వో ముందుకు రాకపోవడంతో కేసు నమోదు కాలేదన్నారు.