శ్రీకాళహస్తి, మన ధ్యాస : కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో తిరుపతికి చెందిన VJ’s Academy విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో అకాడమీ విద్యార్థులు తిషిక, తేజోదయ, ఖ్యాతి, నాగ జస్విక్, జాస్రిత, దాక్షాయణి పాల్గొని భగవద్గీత పారాయణం, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో భక్తులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్నారులు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రదర్శనలు ఇవ్వడంతో పలువురి ప్రశంసలు అందుకున్నారు.విద్యార్థుల ప్రదర్శన పట్ల VJ’s Academy డైరెక్టర్ శ్రీమతి త్రిపుర హర్షం వ్యక్తం చేశారు. చిన్నారుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మం పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు తల్లిదండ్రులు చేస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రతి చిన్నారి భగవద్గీతను నేర్చుకోవడం, పారాయణం చేయడం అలవాటు చేసుకోవాలని ఆమె సూచించారు. భగవద్గీతలోని బోధనలు పిల్లలకు ఆధ్యాత్మిక చింతనతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, మంచి నడవడికను అలవర్చడంలో ఎంతో దోహదపడతాయని తెలిపారు.చిన్నతనం నుంచే పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను పరిచయం చేయడం ద్వారా భావితరాలకు సనాతన ధర్మ వారసత్వాన్ని అందించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
