పాతనాపురం- హసనాపురం రోడ్డు మరమత్తు పనులు ప్రారంభం

రూ.40 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు.. పూర్తిస్థాయి రోడ్డు నిర్మాణం కోసం ఎదురుచూపులు

కలిగిరి, నవంబర్ 12 మన ద్యాస ప్రతినిధి శ్రీకాంత్ కుట్టుబోయిన:

కలిగిరి మండలంలోని పాతనాపురం నుంచి హసనాపురం వరకు ఉన్న రహదారి సమస్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా అధ్వానంగా మారిన ఈ రహదారిపై ప్రస్తుతం మరమ్మతు పనులు చేపడుతున్నప్పటికీ, పూర్తిస్థాయి నిర్మాణం ఎప్పుడు జరుగుతుందన్న ప్రశ్న స్థానికుల్లో వ్యక్తమవుతోంది.రహదారి మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.40 లక్షలు మంజూరు చేసినట్లు పీఎస్ఆర్ ప్రసాదరావు గురువారం వెల్లడించారు. ఈ నిధులతో పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లో జేసీబీ సహాయంతో పనులు చేపట్టి, కంకర, తారు వేసి మరమ్మతులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే కలిగిరి నుంచి పాతనాపురం వరకు ప్యాచ్‌వర్క్ పనులను నిర్వహణ నిధులతో చేపడుతున్నట్లు పేర్కొంటున్నారు.అయితే ప్రతి వర్షాకాలంలో రహదారిపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాతనాపురం నుంచి హసనాపురం వరకు సుమారు ఏడు కిలోమీటర్ల మార్గంలో ప్రయాణం కష్టంగా మారింది. ఈ మార్గంలో నిత్యం ఇసుక లోడుతో వెళ్లే టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్ల రాకపోకలు అధికంగా ఉండటంతో రహదారి పరిస్థితి మరింత దెబ్బతింటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలోనూ పలుమార్లు తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని ప్రజలు చెబుతున్నారు. ప్రతిసారీ వర్షాలు కురిసినప్పుడు రహదారి మళ్లీ దెబ్బతినడం, తిరిగి మరమ్మతులు చేపట్టడం పరిపాటిగా మారిందని వాపోతున్నారు.తాత్కాలిక మరమ్మతులతో కాకుండా పాతనాపురం–హసనాపురం మధ్య పూర్తిస్థాయిలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపడితేనే ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *