కలిగిరిలో భారీ కార్డెన్ సెర్చ్ : 45 బైకులు, ఒక ఆటో సీజ్ – ఎస్పీ ఆదేశాలతో కదిలిన పోలీసులు*
*కలిగిరి, నవంబర్ 13, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.

నెల్లూరు జిల్లా ఎస్పీ ఐపీఎస్ అజిత్ వేజండ్ల ఆదేశాల మేరకు, కావలి డీఎస్పీ ఆధ్వర్యంలో కలిగిరి సర్కిల్ పరిధిలో శుక్రవారం సాయంత్రం భారీ కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.కలిగిరి సీఐ సుబ్బారావు నేతృత్వంలో, ఎస్సైలు మరియు సర్కిల్ స్టాఫ్ తో కలిసి కలిగిరి పట్టణంలోని ప్రధాన కూడళ్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
45 బైకులు సీజ్:
ఈ తనిఖీల్లో భాగంగా పత్రాలు లేని వాహనాలు ను, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 45 ద్విచక్ర వాహనాలు మరియు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వాహనాలను కలిగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వాహనాల యజమానుల పత్రాలను పరిశీలించి, అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్న వాహనాలను అప్పగిస్తామని, మిగిలిన వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బారావు తెలిపారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హెచ్చరిక:
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించామని సీఐ తెలిపారు. గ్రామాల్లో ఎటువంటి ఘర్షణలు, సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన గ్రామాల్లో ప్రత్యేకంగా కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తామని, అల్లర్లకు పాల్పడే వారిపై, రౌడీషీటర్లపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.”ఒకసారి ఎలక్షన్ కేసులో ఇరుక్కుంటే జీవితాంతం ఆ మచ్చ మిగిలిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావు. కాబట్టి యువత, ప్రజలు ఎవరూ గొడవలకు వెళ్లవద్దు” అని సీఐ సూచించారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించాలి:
అదేవిధంగా రోడ్డు భద్రతలో భాగంగా ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని సూచించారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కలిగిరి ఎస్సై లతీపున్నీసా వింజమూరు ఎస్సై మరియు కలిగిరి సర్కిల్ పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
