మన ధ్యాస ,న్యూఢిల్లీ /నెల్లూరు, డిసెంబర్ 16:నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ మేరకు భారత రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ ను మంగళవారం ఢిల్లీ లోని ఆయన కార్యాలయంలో కలిసి జిల్లాలో రైల్వే పరిధిలో పెండింగ్లో ఉన్న అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో లెవెల్ క్రాసింగ్‌లను తొలగించడంలో భాగంగా, కావలి యార్డ్, వేదాయపాళెం, అల్లూరు రోడ్డు, వెంకటాచలం, గూడూరు, పడుగుపాడు, తెట్టు-ఉలవపాడు, వెంకటేశ్వరపాలెం మొదలైన వాటిలో 11 లెవెల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబి(ఆర్ఓబి), లేదా ఆర్‌యూబి( ఆర్ యు బి ) లను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కావలి యార్డు, తెట్టు-ఉలవపాడులో మాత్రమే పనులు సాగుతుండగా, మరికొన్ని నిర్మాణ దశకు చేరుకోలేదని వివరించారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. నడికుడి-శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైను పనులపై కూడా ఎంపీ వేమిరెడ్డి.. సంతోష్ కుమార్ దృష్టికి తెచ్చారు. 235 కిలోమీటర్ల పొడవున బ్యాలెన్స్ లైన్ వేయాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చెన్నై-కోల్‌కత్తా రైల్వే లైన్‌కి ప్రత్యామ్నాయంగా ఈ రైల్వేలైన్ ఉపయోగపడుతుందన్నారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 700 ఎకరాల్లో ఉన్న బిట్రగుంట రైల్వే అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉందని ఎంపీ.. ఆయనకు వివరించారు. అన్ని వసతులు ఉన్న బిట్రగుంట ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే రైల్వే పరంగా ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యూనిట్‌ను బిట్రగుంటలో ఏర్పాటు చేయవచ్చని వివరించారు.అలాగే ప్రస్తుతం చెన్నై – సూళ్లూరు పేట మధ్య నడుస్తున్న ఈఎంయు రైల్ సేవలను నాయుడు పేట వరకు పొడిగించాలని వినతి చేశారు. ఈఎంయు సేవలను నాయుడుపేట వరకు పొడిగించడం వల్ల చుట్టుపక్కల మండలాలు, గ్రామాల నుండి 5 లక్షల మంది జనాభాకు ప్రయోజనం చేకూరుతుందని, చెన్నై, నాయుడుపేట సమీపంలోని పారిశ్రామిక ప్రాంతాలకు ప్రయాణించే శ్రామికులకు ఉపయోగమన్నారు. దాంతో పాటు చెన్నై- బిట్రగుంట మధ్య ఈఎంయు రైళ్ళను కావలి వరకు పొడిగించాలని, శబరి ఎక్స్ప్రెస్, పద్మావతి ఎక్స్ప్రెస్, బెంగళూరు, హౌరా ఎక్స్ప్రెస్, చెన్నై, హౌరా ఎక్స్ప్రెస్, సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు కావలిలో హాల్టింగ్ ఇవ్వాలని కోరారు. గంగా- కావేరి, కోరమండల్, తమిళనాడు ఎక్స్ప్రెస్ లకు నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లో హాల్టింగ్ కల్పించాలని తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వినతులను పరిశీలించిన రైల్వే బోర్డు చైర్మన్ వీటిపై పరిశీలించి పెండింగ్ ప్రాజెక్టులను, అభివృద్ధి అంశాలను త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
