మన ధ్యాస పార్వతీపురం, సెప్టెంబర్ 23:- అడాలి వ్యూ పాయింట్ అతి సుందరమైన ప్రాంతమని, పర్యాటకులను ఆకర్షించేలా ఈ ప్రాంతాన్ని సహజ సిద్ధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సీతంపేట వద్ద గల అడాలి వ్యూ పాయింట్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యుత్తమ పర్యాటక ప్రదేశాల్లో ఒకటని, జిల్లా యంత్రాంగం మంచి పర్యాటక కేంద్రంగా గుర్తించి కొన్ని సౌకర్యాలు కల్పించిందని అన్నారు. అయితే ప్రకృతి సిద్ధంగా ఉండి, ఆహ్లాదకర వాతావరణంలో ఉండే ఈ వ్యూ పాయింట్ లో కాంక్రీటుతో కట్టిన కట్టడాలు కన్నా వెదురుతో చేసిన కట్టడాల వలన సహజసిద్ధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయడం వలన విశేషంగా పర్యాటకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విచ్చేసే పర్యాటకులకు అవసరమైన అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అంతకుముందు పాలకొండ మునిసిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన పట్టణాభివృద్ధికి అవసరమైన టౌన్ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. మునిసిపల్ పరిధిలో ఉండే చెరువులను అభివృద్ధి చేయాలని, చెరువుల చుట్టూ మొక్కలను నాటి సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని అన్నారు. అలాగే చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేయడం వలన పాదచారులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. మునిసిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది అందరూ పనివేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వివిధ విభాగాలను తనిఖీ చేసిన కలెక్టర్, విధులు నిర్వహిస్తున్న అధికారులకు సంబంధించిన చార్టులను ప్రజలకు తెలిసేలా ఉంచాలని అన్నారు.ఈ పర్యటనలో పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్,జిల్లాపర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ రమాదేవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ నాగభూషణం, ఏపీఓ చినబాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *