


మన న్యూస్, హైదరాబాద్,జోగిపేట్, జులై17,
వానాకాలం, రబ్బీ సీజన్లో రైతులు పంటలు సాగు చేసేందుకు అవసరమయ్యే సాగు నీటిని ప్రతి ఎకరాకు అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టు వద్ద ఉన్న సింగూరు ఎడమ కాలువ కాల్వ నుంచి గురువారం మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి సాగునీటికి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగూర్ ప్రాజెక్టు నుంచి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. రైతులు సింగూరు నీటిని వినియోగించుకొని పంటలు సాగు చేసుకోవాలని ఆయన తెలిపారు. సింగూరు నీటి విడుదలలో రాజకీయాల జోక్యం వద్దు అని, రైతు సంక్షేమానికి ప్రజా పాలన ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాల్వల ద్వారా అందోల్, పుల్కల్,
చౌటాకూర్ మండలాల పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను నింపి, ఆపై క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సింగూరు కాలవల మరమ్మతులు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. రైతులందరూ దీనికి సహకరించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో రాజనర్సింహ ఫౌండేషన్ చైర్మన్ త్రిష దామోదర, పుల్కల్ మండల పార్టీ అధ్యక్షులు దుర్గారెడ్డి, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ మక్త జగన్ మోహన్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ భీమ్, అందోల్ ఆర్డీవో ఆర్. పాండు, సింగూరు డిప్యూటీ ఈఈ నాగరాజ్, అందోల్ డిప్యూటీ ఈఈ విక్రమ్, ఏ డబ్ల్యు మజార్, మైపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సురేందర్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల ప్రవీణ్ కుమార్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.