

ఎస్.ఆర్.పురం,మన న్యూస్ , జూలై 10:– ఎస్.ఆర్.పురం మండలంలోని కటికపల్లి పంచాయతీలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం బుధవారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమల్ల ప్రసాద్ రావు , గంగాధర నెల్లూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటిని స్వయంగా సందర్శించి, ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంలో అమలు చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేశారు. ముఖ్యంగా పింఛన్లు, రైతు భరోసా,తల్లికి వందనం మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాల గురించి వివరించారు. ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు పాటుపడుతున్న విధానాలపై రూపొందించిన కరపత్రాలను ప్రతీ ఇంటికి పంపిణీ చేయడం జరిగింది. ప్రజలతో మమేకమవుతూ నాయకులు వారి సమస్యలను, అభిప్రాయాలను నేరుగా స్వీకరించడం జరిగింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రభుత్వ కార్యకలాపాలపై సానుకూల స్పందన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికార యంత్రాంగం సభ్యులు మరియు గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు. “సుపరిపాలన తొలి అడుగు” అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండే పాలనకు మార్గం సుగమం చేస్తున్నామన్న సందేశాన్ని నాయకులు పునరుద్ఘాటించారు. అధికారవర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిర్వహించబడతుంది. ప్రజల అభ్యున్నతికే తమ అంకిత భావంతో పనిచేస్తున్నామని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేయడమే తమ లక్ష్యమని ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు తెలుగు యువత అధ్యక్షులు కిషన్ తదితరులు పాల్గొన్నారు.