మన న్యూస్: పినపాక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం వారు పండించిన సన్నరకం ధాన్యానికి గిట్టుబాటు ధర క్వింటాల్ కి ఎ- గ్రేడ్ కి రూ.2320, బి – గ్రేడ్ కి 2300 తో పాటుగా రూ.500 బోనస్ ను అందజేస్తుంది. ఈ బోనస్ రైతులకు చేరేది కొంతైతే మరికొంత ప్రైవేటు వ్యాపారులకు సంబంధిత అధికారుల అండదండలతో చేరుతున్నట్లు ఆరోపణలు బహిర్గతంగానే వెళ్ళు వెత్తుతున్నాయి. పంట పెట్టుబడికై ప్రైవేటు వ్యాపారుల వద్ద ఎరువులు, పురుగుమందులు అప్పుగా తీసుకున్న రైతులు అటు ప్రభుత్వం అందించే బోనస్ కు దూరమవుతూ ఇటు ప్రైవేటు సావుకారులు చెప్పిన రేట్లకే ధాన్యం అమ్ముతూ, వడ్డీలకు వడ్డీలు కడుతూ నష్టపోతున్నారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యాపారులు రైతుల భూమి కాగితాలు తీసుకొని కొందరూ, తమ బంధువుల, అనుకూల వ్యక్తుల భూమి కాగితాలు తీసుకొని కొందరు సంబంధిత అధికారుల అండదండలతో వారి పొలాలను కౌలుకు సాగిచేసుకుంటున్నట్లు వ్రాయించి ఐకేపీ, డీసీఎంఎస్, జీసీసీ, సొసైటీ వంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముతున్నట్లు తెలియవస్తుంది. రైతుల వద్ద తక్కువ ధరకు కొనడం, రైతులు తీసుకున్న ఎరువులు పురుగుమందుల కు అసలు, అధికవడ్డీ వసూలు, రైతుల పేర బోనస్ ను ఇలా మూడు విధాలుగా కొందరు ప్రైవేటు వ్యాపారులు రైతుల కష్టాన్ని మింగుతున్నారు. రైతులకు కొనుగోలు కేంద్రంలో అందని గన్నీబ్యాగులు దళారులు కొనుగోలు చేసే పంటకల్లాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. పంట ఒకరిదీ ఫలితం మరొకరిది.









