

మన న్యూస్, కోవూరు, మే 17:- బజారు సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగిన తిరంగా ర్యాలి. – ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 100 మీటర్ల మువ్వన్నెల జాతీయ జెండా.. – వేలాదిగా తరలి వచ్చి స్వఛ్ఛందంగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ సంబరాలలో పాల్గొన్న ప్రజలు. – మాతృభూమి రక్షణలో అశువులు బాసిన తెలుగు వీరుడు మురళి నాయక్ కు ఘన నివాళులు. కోవూరు వీధులు శనివారం ఉదయం వందేమాతరం, భారత్ మాతాకి జై నినాదాలతో ప్రతిధ్వనించాయి. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని మువ్వన్నెల పతాకాలు చేతబట్టి కోవూరు బజారు సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగిన తిరంగా ర్యాలిలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తిని చాటారు. గగనతల యుద్ధంలో పాకిస్తాన్ వెన్ను విరిచిన మనదేశ సైనికుల శౌర్య పరాక్రమాలు ప్రశంసించే నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలను బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీ రెడ్డి, బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, టిడిపి సీనియర్ నాయకులు బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, వీరేంద్ర నాయుడు, ఇంతా మల్లారెడ్డి కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు కూల్చి పాక్ ముష్కర మూకలను మట్టు పెట్టిన వైనాన్ని ప్రజలకు వివరించారు. మరోసారి తోక జాడిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనపడదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా మాతృభూమి రక్షణలో అశువులు బాసిన తెలుగు వీరుడు మురళి నాయక్ కు ఘన నివాళులు అర్పించారు. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాలలో పాల్గొన్న ప్రజానీకానికి వారు ధన్యవాదాలు తెలియచేసారు. తిరంగా ర్యాలి విజయవంతం చేయడంలో సహాయ సహకారాలు అందించిన ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లకు కృతజ్ఞతలు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో పెన్నాడెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి, కోవూరు, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరు పేట, బుచ్చిరెడ్డి పాళెం అర్బన్, రూరల్ మండల టిడిపి అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, ఏటూరు శ్రీహరి రెడ్డి, ఎకోళ్ళు పవన్ కుమార్ రెడ్డి, గుత్తా శ్రీనివాసరావు, బెజవాడ జగదీష్ లతో పాటు జొన్నవాడ ఆలయ సేవా కమిటి అధ్యక్షులు తిరుమూరు అశోక్ రెడ్డి, సీనియర్ తెలుగుదేశం నాయకులు బత్తుల హరికృష్ణ, అమరేందర్ రెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి, మోర్ల మురళి, బిజెపి నాయకులు రాఘవేంద్ర, జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి, చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, శేఖర్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.


