• అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం.

మన ధ్యాస, మక్తల్: మహిళా సాధికారత, పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. సోమవారం మక్తల్ పట్టణంలోని ద్వారక ఫంక్షన్ హాల్ లో మక్తల్ నియోజక వర్గానికి సంబంధించిన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ల మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణ, మాగనూరు, మక్తల్, మక్తల్ మున్సిపాలిటీ, ఉట్కూరు, నర్వ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన లబ్ధిదారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు, పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను మహిళల పేర్లతో అందించడం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా రూ.20 లక్షల వరకు రుణాలు అందుతున్నాయని, మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంకుల వంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, నారాయణపేట జిల్లాలో కూడా మహిళా సంఘాల సభ్యులకు పెట్రోల్ బంక్ కేటాయించినట్లు వెల్లడించారు.నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అర్హులైన నిరుపేదలకు రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో సుమారు 5,500 ఇళ్లను మంజూరు చేయడం ద్వారా రూ.275 కోట్ల విలువైన గృహ నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని కృష్ణ, మాగనూరు, మక్తల్, ఉట్కూరు, నర్వ మండలాలు, మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం 4,085 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకోసం ప్రతి నెలా సుమారు రూ.95.11 లక్షల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయని తెలిపారు.వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, డయాలసిస్ రోగులకు ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందన్నారు. ఇంకా అర్హత ఉన్నప్పటికీ పెన్షన్లు అందని వారిని గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరో 200 పెన్షన్ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, వాటిని కూడా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.భర్తను కోల్పోయిన ఏ ఒక్క మహిళ కూడా పెన్షన్‌కు దూరం కాకూడదని, అర్హులైన వితంతువులందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. రాష్ట్రంలో ప్రతి రేషన్ కార్డుదారునికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. కరువు పరిస్థితులు ఎదురైనా ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే ఎనిమిది నెలలకు సరిపడా సన్నబియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి నెలా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ కొనసాగుతుందని తెలిపారు.ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వరి సాగుపై అధికంగా ఆధారపడకుండా ఆరుతడి పంటలను సాగు చేయాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రాబోయే వేసవిలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నారాయణపేట జిల్లాలో ప్రతి నెల 17 వేల మందికి పైగా లబ్ధిదారులకు వివిధ రకాల సామాజిక భద్రతా పెన్షన్ల రూపంలో ప్రభుత్వం సుమారు రూ.18 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేస్తోందని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలిపారు.జిల్లాలో వృద్ధాప్య, మహిళా, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు వివిధ రకాల పెన్షన్ల ద్వారా ప్రతి నెలా రూ.18 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు.అదేవిధంగా కొత్త పెన్షన్ల కోసం జిల్లావ్యాప్తంగా సుమారు 12 వేల దరఖాస్తులు అందగా, తొలి విడతలో 7,500 దరఖాస్తులకు పెన్షన్లు మంజూరు చేసి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ వెంకట్ రాములు, మక్తల్ మున్సిపల్ చైర్ పర్సన్ మానస, మున్సిపల్ కమిషనర్ రాజయ్య, అన్ని మండలాల ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, వివిధ మండలాల నుంచి వచ్చిన లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *