ట్రైనర్ స్వప్న ఆధ్వర్యంలో నైపుణ్యాలు చాటిన విద్యార్థినిలు.
మహిళల ఆర్థిక స్వావలంబనకే ప్రాధాన్యత.
మన ధ్యాస, మక్తల్: మక్తల్ పట్టణంలోని సెట్విన్ (SETWIN) వృత్తి విద్యా శిక్షణ కేంద్రంలో బ్యూటీషియన్ కోర్సు అభ్యర్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. బ్యూటీషియన్ ట్రైనర్ స్వప్న ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా ట్రైనీలందరూ కలిసి విభిన్న రీతుల్లో బ్రైడల్ మేకప్ (పెళ్లికూతురు అలంకరణ) చేసి అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారు.శిక్షణలో భాగంగా సంప్రదాయ, ఆధునిక పద్ధతులలో వధువుల మేకప్, సరికొత్త హెయిర్ స్టైల్స్, ఐ-మేకప్, అలాగే ఆకర్షణీయమైన చీర కట్టు (శారీ డ్రేపింగ్) వంటి అంశాలపై ట్రైనీలు ప్రాక్టికల్స్ నిర్వహించారు. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ప్రొఫెషనల్ బ్యూటీ ట్రెండ్స్ను ట్రైనీలు అత్యంత ప్రతిభావంతంగా చేసి చూపించడం పట్ల పలువురు ప్రశంసించారు.ఈ సందర్భంగా బ్యూటీషియన్ ట్రైనర్ స్వప్న మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో బ్యూటీ , వెల్నెస్ రంగంలో మహిళలకు అపారమైన స్వయం ఉపాధి అవకాశాలు ఉన్నాయని, సెట్విన్ అందిస్తున్న నాణ్యమైన శిక్షణను సద్వినియోగం చేసుకొని, ట్రైనీలు సొంతంగా బ్యూటీ పార్లర్లు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా, ప్రొఫెషనల్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్టులుగా మారి ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో సెట్విన్ కేంద్ర మిగతా శిక్షకులు తిమ్మప్ప, వీరమ్మ, ఫర్హానా, సిబ్బంది ప్రవీణ్, లక్ష్మీ, ట్రైనీలు తదితరులు పాల్గొన్నారు.
