*కలిగిరి, అక్టోబర్ 02, మన న్యూస్ RC ఇన్చార్జి నాగరాజు కె.

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కలిగిరి గ్రామానికి చెందిన యువ కబడ్డీ క్రీడాకారుడు గోసాల మహేష్ (24) భారతదేశ కబడ్డీ రిఫరీగా ఎంపికై ఘనత సాధించాడు.అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AKFI) ఆధ్వర్యంలో ఇటీవల కృష్ణా జిల్లా అవనిగడ్డలో జాతీయ స్థాయి కబడ్డీ రిఫరీ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వందలాది మంది రిఫరీలు ఈ సెలక్షన్ కు హాజరయ్యారు. ఇందులో కఠినమైన ఫిట్ నెస్ టెస్ట్, రూల్స్ పై రాత పరీక్ష, ప్రాక్టికల్ గ్రౌండ్ టెస్ట్ లు నిర్వహించారు.ఈ సెలక్షన్ లో ప్రతిభ కనబరిచిన మహేష్ దేశవ్యాప్తంగా ఎంపికైన 79 మంది కబడ్డీ రిఫరీలలో ఒకరిగా నిలిచాడు. ఈ విషయాన్ని AKFI బోర్డు అధికారికంగా ప్రకటించింది.చిన్న వయసు నుండే కబడ్డీ అంటే ఎంతో ఇష్టం ఉన్న మహేష్, గ్రామ స్థాయి నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు అనేక టోర్నమెంట్లలో పాల్గొని రిఫరీగా అనుభవం సంపాదించాడు. అతని నిబద్ధత, క్రమశిక్షణ, కబడ్డీ రూల్స్ పై ఉన్న పట్టే ఈ జాతీయ స్థాయి గుర్తింపుకు కారణమైంది.నెల్లూరు జిల్లాకే గర్వకారణం:నెల్లూరు జిల్లా నుంచి భారత కబడ్డీ రిఫరీ ప్యానల్ లోకి మహేష్ ఎంపిక కావడం జిల్లా కబడ్డీ చరిత్రలో గర్వకారణమని నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మరియు ప్రెసిడెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. మహేష్ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి రిఫరీగా ఎదగాలని, కలిగిరి గ్రామానికి, నెల్లూరు జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. గ్రామస్తులు, క్రీడాకారులు, యువత మహేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *