తవణంపల్లె, మన ద్యాస (ప్రతాప్ రెడ్డి), సెప్టెంబర్-19: తవణంపల్లి మండలం మాధవరం అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ నిర్మల ఆధ్వర్యంలో పోషణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా సిడిపిఓ నిర్మల మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యానికి స్థానికంగా లభించే ఆకుకూరలు మరియు సీజనల్ ఫలాలు ఎంతో ముఖ్యమని తెలిపారు. పిల్లలకు జంక్ ఫుడ్ ఇవ్వకుండా పోషకాహారం అందించాలని తల్లులకు సూచించారు. అలాగే ఇంట్లో వండిన ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలని, చల్లని ఆహారం తినకూడదని ఆమె వివరించారు. అంగన్వాడీ కేంద్రాలు మరియు పాఠశాలల్లో పిల్లలకు ప్రతిరోజూ మెనూ ప్రకారం తాజా వేడి భోజనం అందిస్తున్నామని తెలిపారు. మునగ ఆకులో అధికంగా పోషకాలు ఉంటాయని, వారానికి కనీసం మూడు రోజులు మునగ ఆకును ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మునగ ఆకును పొడి చేసి రోజూ వండే కూరల్లో రెండు స్పూన్లు కలిపి తింటే కుటుంబ సభ్యులందరికీ పోషకాలు అందుతాయని చెప్పారు. అంగన్వాడీ కేంద్రంలో మెనూ ప్రకారం వేడి భోజనం, పాలు, గుడ్లు అందిస్తూ, ఆటపాటల ద్వారా విద్యను కూడా బోధిస్తున్నామని తల్లులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ నిర్మల, సూపర్వైజర్ లావణ్య, స్కూల్ టీచర్ హరీష్, అంగన్వాడీ కార్యకర్త చిత్ర మరియు తల్లులు పాల్గొన్నారు.