- రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు…
- కరవు మండలాలను ప్రకటించి రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి…
- జిల్లా వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు కె.కె. రాజు..
విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి సెప్టెంబర్ 18: మద్దిలపాలెం వైఎస్సార్సీపి పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు కే.కే.రాజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కే.కే.రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు,వ్యవసాయ కూలీలు,పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కె.కె.రాజు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా వర్షపాతం లోటు నమోదవుతున్నప్పటికీ,ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.ఖరీఫ్ ప్రారంభం నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు రాష్ట్రంలో 51 శాతానికి పైగా వర్షపాతం లోటు నమోదైందని,28 జిల్లాల్లోనూ వర్షపాతం లోటు ఉందని తెలిపారు.688 మండలాలకు గాను సుమారు 628 మండలాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటుండగా,సుమారు 332 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లాలో కూడా సుమారు 54శాతం వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు.వర్షాభావ పరిస్థితులు ముందుగానే స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం తగిన ముందస్తు చర్యలు చేపట్టలేదని కె.కె. రాజు అన్నారు.ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను ముందుగానే అన్ని జిల్లాలకు అందుబాటులో ఉంచాల్సి అవసరం ఉందని తెలిపారు.ఆ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్నారు.రైతులు పశుగ్రాసాన్ని అవసరమైన జిల్లాలకు ముందుగానే పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.రైతులు ప్రభుత్వంపై నమ్మకంతో సాగులోకి దిగినప్పటికీ వర్షాలు లేక పంటలు దెబ్బతినడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని కే.కే.రాజు తెలిపారు.పంట సాగు చేసేన ప్రతి రైతుకు పంటను బట్టి ఎకరాకు రూ.15 వేలకుపైగా నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు.ఖరీఫ్‌లో సాధారణంగా సాగయ్యే విస్తీర్ణంతో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.జూన్,జూలై,ఆగస్టు నెలల్లో వరుసగా వర్షపాతం లోటు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కరవు మండలాలను ప్రకటించాలని కె.కె.రాజు డిమాండ్ చేశారు.కరవు మండలాల ప్రకటనతో రైతులకు రుణాల రీషెడ్యూల్,పంటల బీమా క్లెయిమ్‌లు, ఇతర ప్రభుత్వ సహాయాలు అందే అవకాశం ఉంటుందని తెలిపారు.రైతులపై ఆర్థిక భారం మరింత పెరగకుండా ప్రభుత్వం తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. రైతులకు గతంలో అందుబాటులో ఉన్న ఉచిత పంటల బీమా రక్షణను పునరుద్ధరించాలని ఆయన కోరారు. ఇప్పటికే పంట నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని.రైతుల నుంచి వసూలు చేసిన ప్రీమియం విషయంలో కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు తగిన పరిహారం అందించాలని కోరారు.కరవు కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని కె.కె.రాజు అన్నారు. పశువులను పోషించుకునేందుకు కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నందున ప్రభుత్వం ఉచితంగా పశుగ్రాసాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఇప్పటికే ఆలస్యమైందని,ఇకనైనా యుద్ధప్రాతిపదికన పశుగ్రాసం పంపిణీ చేపట్టాలని అన్నారు.కరవు కారణంగా వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల వలసలు ప్రారంభమవుతున్నాయని కె.కె.రాజు తెలిపారు.అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు అదనంగా ఉపాధి హామీ పనిదినాలు కల్పించి వ్యవసాయ కూలీలకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు.కరవు ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రతరం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.అవసరమైన ప్రాంతాల్లో ఉచిత ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని కోరారు.బోర్ల కింద సాగు చేస్తున్న రైతుల పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో కోతలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.వర్షాభావ పరిస్థితుల కారణంగా పండ్ల తోటలు కూడా దెబ్బతింటున్నాయని కె.కె.రాజుతెలిపారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులు మరింత నష్టపోకుండా పండ్ల తోటలకు నీటి సరఫరా కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట సబ్సిడీపై ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని కోరారు.తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో నష్టపోయి రైతు కుటుంబాలు మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం వారికి అండగా నిలవాలని కె.కె.రాజు అన్నారు.రైతు కుటుంబాల్లో పిల్లల చదువులు ఆగిపోకుండా విద్యా, వసతి సంబంధిత బకాయిలను విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కరవు పరిస్థితులను కేవలం ఒక సహజ సమస్యగా చూడకుండా,రైతులు మరియు గ్రామీణ ప్రజల జీవనోపాధిపై పడుతున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కె.కె.రాజు అన్నారు.రైతులకు అవసరమైన విత్తనాలు, పశుగ్రాసం, పంటల బీమా,ఇన్‌పుట్ సబ్సిడీ,ఉపాధి హామీ, తాగునీరు,విద్యుత్ వంటి అంశాలపై తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో రైతులు,వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైన చోట వినతిపత్రాలు సమర్పిస్తామని కె.కె.రాజు తెలిపారు.రైతుల సమస్యలపై పార్టీ నాయకులు,కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అండగా నిలుస్తారని చెప్పారు.తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. తక్షణమే కరవు మండలాలను ప్రకటించి,రైతులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె.రాజు స్పష్టం చేశారు.