

మనన్యూస్,నారాయణ పేట:బిసి రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదముద్ర వేయడం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట సురేష్, గణేష్ కుమార్, ఏ రవికుమార్ కొనియాడారు. మంగళవారం నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.రాష్ట్ర ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న బీసీ రిజర్వేషన్ బిల్లు కు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదముద్ర పలకడం, అదే సమయంలో తాను శాసనసభలో ఎమ్మెల్యేగా ఉండి బీసీ రిజర్వేషన్ కు మద్దతు తెలిపే అవకాశం కలగడం అదృష్టమని, ఇలాంటి అవకాశాన్ని తనకు కలిగించిన మక్తల్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా తాను రుణపడి ఉంటానని ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి తెలిపారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి, అన్ని పార్టీలతో మంతనాలు జరిపి రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపేలా చొరవ చూపిన మంత్రులు, ఇతర నాయకులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపరన్నారు. విద్యా, ఉద్యోగరంగం తో పాటు రాజకీయంగా, ఇతర అన్ని అంశాల్లో బీసీ రిజర్వేషన్ అందుబాటులోకి వస్తే ఎంతో ఉన్నతి చెందుతారని తెలిపారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వంతో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర వేయించి ఫలాలను అందించేలా కృషి చేయాలని అన్ని పార్టీల నేతలను కోరారనితెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీలో ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ,రిజర్వేషన్ బీసీలకు ఎంత అవసరమో వాటి ప్రాముఖ్యతను వివరించారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ కోసం ఎమ్మెల్యే గళ మెత్తి అందరికీ ఆదర్శంగా నిలిచారని, అవసరమైతే రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రంతో ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధమని అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చెయ్యడానికైనా సిద్ధమని ప్రకటించడం ఆయన చిత్తశుద్ధికి నిరసనమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కులగణన సర్వేను విజయవంతంగా నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేలా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించారని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో బీసీ వర్గాలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని, రిజర్వేషన్ అమల్లోకి వస్తే అన్ని రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకొని మరింతగా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ శ్రీనివాసులు, మందుల నరేందర్, శంషుద్దీన్, చిన్న నర్సిములు, కావలి తాయప్ప, గుంతలి శివ కుమార్, కావలి ఆంజనేయులు, వాకిటి శ్యామ్, వాకిటి హనుమంతు, పంచలింగాల నగేష్, కల్లూరి గోవర్ధన్, గుంతల రవి, వాకిటి భాస్కర్, బ్యాగరి సురేష్, శేఖర్ ,నరసింహ, చెన్నయ్య ,శివ తదితరులు పాల్గొన్నారు.