‘
మన ధ్యాస, నెల్లూరు, సెప్టెంబర్ 22 : విద్య నేడు ఒక్క పెద్ద వ్యాపారం…. కోచింగ్ సెంటర్లు నిలువు దోపిడీకి కేంద్రాలు… ఎంట్రెన్స్ పరీక్షలు లీకేజీలకూ, అవినీతి రాజకీయాలకు రాచబాటలు… మంచి ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో, అహెరారాత్రులు కష్టపడి ర్యాంకులు సాధించినా, ఉపాధి దొరక్క నిరుద్యోగ సైన్యంలో చేరడమే అని పిడిఎస్ యు నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎం. సునీల్ నెల్లూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం. సునీల్ మాట్లాడుతూ……… కేంద్ర ప్రభుత్వ శాఖలలో లక్షలాది ఉద్యోగ పోస్టులు ఖాళీగా వున్న బిజేపీ-ఆర్ఎస్ఎస్ల మోడీ ప్రభుత్వం భర్తీ చేయడం లేదు అని అన్నారు. రాష్ట్రంలోనూ లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలున్నా, కూటమి ప్రభుత్వం భర్తీ చేయడం లేదు, ఇలాంటి పరిస్థితులలో పీ డి ఎస్ యు నెల్లూరు జిల్లా 17వ మహాసభ సందర్భంగా “శాశ్వతమైన, గౌరప్రదమైన ఉపాధి ప్రతి విద్యార్థి హక్కు” అని నినదిస్తూ, సెప్టెంబరు 25న నెల్లూరు నగరంలో ఉదయం 10 గం లకు నెల్లూరు విఆర్సి సెంటర్ నుండి సర్వోదయ కాలేజీ వరకు చేపట్టిన మహాప్రదర్శన లో, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని, జయప్రదం చేయాలని జిల్లా కార్యవర్గం పిలుపునిస్తుంది అని అన్నారు . విద్యా వ్యాపారం తప్పు ఉద్యోగాలేవి? విద్యా వ్యాపారాన్ని ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తూ, ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యంగా చేస్తున్నాయి…. భారీ విద్యా వ్యాపారం చేసే స్కూల్లోనో, కాలేజీలోనో లక్షల్లో ఫీజులు కట్టి చదివితేనే, ఉద్యోగం వస్తుందనే భయాన్ని తల్లిదండ్రుల్లో కలిగించారు అని తెలిపారు . దీనితో, పేదల నుండి మధ్యతరగతి వరకు తమ సంవత్సరాంత కష్టార్జితంలో మూడొంతులు ఆదాయాన్ని, ప్రైవేట్ విద్యకూ, కోచింగ్ సెంటర్స్‌కు ఖర్చు చేస్తున్నారు.. అప్పులు పాలవుతున్నారు అని అన్నారు. ముఖ్యంగా గత రెండుమూడేళ్ల నుండి ఉద్యోగావకాశాలు మరింత తగ్గిపోవడంతో, వందల మంది ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనికి కారణం విద్యనూ, ఉపాధిని దేశ నవతరపు హక్కుగా అందించాలనే బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పుకొని, ఈ రంగాలను కార్పోరేట్ వ్యాపారుల దోపిడికి కట్టబెట్టడమే. అందువలనే, మోడీ అధికారంలోకి వచ్చి, 12 ఏళ్ళు గడిచినా, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన వాగ్దానాన్ని, నేటికీ అమలుచేయలేదు అని అన్నారు. ఈ 12 ఏళ్ళలో, 24 కోట్ల ఉద్యోగాలు కల్పించక పోగా, పైగా ఉన్న ఉద్యోగులను సైతం తొలిగిస్తున్నారు. 2022 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖలలో 9 లక్షల 79 వేలకు పైగా పోస్టులు ఖాళీగా వున్నా, మోడీ ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఒక్క రైల్వేలోనే సమారు 6 లక్షల ఉద్యోగాలు తగ్గాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లోనే కాదు, బబటి వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో 2021-22లో 98.54 శాతం వున్న ప్లేస్‌మెంట్స్ 2023-24 నాటికి 79.88 శాతానికి తగ్గాయి. ప్రతిరోజూ సాఫ్ట్వేర్ కంపెనీల నుండి ఉద్యోగులను వేలాదిగా తొలిగిస్తూనే వున్నారు. ఫలితంగా, 25 ఏళ్లలోపు కొత్తగా డిగ్రీ పూర్తిచేసిన వారిలో 45 శాతం మంది ఉద్యోగాలు లేక నిరుద్యోగ సైన్యంలో చేరుతూనే వున్నారు అని తెలియజేశారు. రాష్ట్రంలో నిన్నటి జగన్ పాలనలోనూ, నేటి టిడిపి-జనసేన-బిజేపి కూటమి పాలనలోనూ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా వున్న లక్షలాది పోస్టులను భర్తీ చేయడం లేదు అని అన్నారు . జాబ్ కాలెండర్ పేరుతో అరకొర పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నారు….లక్షల సంఖ్యలో భద్రత లేని కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తూ, వెట్టిచాకిరి చేయించుకుంటూ, వారి శ్రమను దోచుకుంటున్నారు అని అన్నారు . భర్తీ చేస్తున్న పోస్టులలోనూ పారదర్శకత వుండడం లేదు…. ఎన్నికల్లో వాగ్ధానాం చేసిన నిరుద్యోగ భృతిని నేటికి అమలు చేయలేదు అని అన్నారు . అందువలనే, ఇంజనీరింగ్ చదివిన వారు సైతం జొమాటో, స్విగ్గీ, అమెజాన్ వంటి విదేశీ కంపెనీలలో డెలివరీ బాయ్స్ గా చేరి, డిజిటల్ బానిసల్లాగా బతకాల్సివస్తుంది అని అన్నారు. ఇంకోవైపు, కృత్రిమ మేథ(ఏఐ)తో ఉపాధి అవకాశాలు మరింత తగ్గుతుండడంతో, విద్యార్థుల్లో, యువతలో భవిష్యత్ జీవితం పట్ల తీవ్ర ఆందోళన నెలకొంది అని తెలిపారు.ఢిల్లీ జెన్ జడ్ ఉద్యమ స్ఫూర్తితో….మోడీ ప్రభుత్వం నూతన విద్యావిధానం-2020 అమల్లోకి తెచ్చినప్పటి నుండి విద్యపై రాష్ట్రాలకున్న అధికారాలను హరించి, సిలబస్ నుండి ఎంట్రెన్స్ ప్రరీక్షల నిర్వహణ వరకు తన చేతిలో కేంద్రీకరించుకుంది. అప్పటి నుండి యూనివర్శిటీలు నిధుల కొరతతో, అద్యాపకుల కొరతతో, ప్రశ్నించే విద్యార్థులపై దాడులతో, దేశద్రోహ కేసులతో, ఒక భయం గుప్పెట్లోకి నెట్టబడ్డాయి అని అన్నారు . ఈ నేపథ్యం నుండే, 22 మంది నీట్ విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అవినీతిపరులతో నిండిపోయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( ఎన్ టి ఏ ) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ ( సిజెపి) జులై 20న చలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చింది. ఈ ఉద్యమంలో పాల్గొనే విద్యార్ధియువకులను దేశ ద్రోహులని, పాకిస్తాన్ ఏజెంట్స్ అని మోడీ ప్రభుత్వమూ, దాని అనుకూల మీడియా ప్రచారం చేసింది అని అన్నారు . అయినప్పటికీ, విద్యా వ్యాపారంపై, నిరుద్యోగంపై, బాధ్యత మరిచిన మోడీ ప్రభుత్వంపై ఆగ్రహంతో వున్న లక్షలాది మంది జెన్ జడ్ తరం (నేటి విద్యార్థి యువతరం), కులమత విభజన కుట్రలను పక్కనబెట్టి, విద్యార్ధి లోకమంతా ఒక్కటై, ఢిల్లీ జంతర్ మంతర్ కు చేరుకుంది అని తెలిపారు. లాఠీచార్జీలూ, బాష్పవాయుగోళాలూ, నీటీ పిరంగులతో హింసను ప్రయోగించినా; ప్రభుత్వ అనుకూల గూండాలు దాడులు చేసినా, గాయపర్చినా, తలలు పగులగొట్టి నేత్తురు పారించినా-జెన్ జడ్ తరం, ముఖ్యంగా అమ్మాయిలు వీరోచితంగా ఉద్యమించి, నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టడంతో, నియంత మోడీ ప్రభుత్వం కదలిపోయింది. చివరకు విద్యాశాఖా మంత్రి రాజీనామా చేయడంతో, ఢిల్లీ జెన్ జడ్ ఉద్యమం ఒక చారిత్రాత్మక పోరాట స్ఫూర్తిని, ఈ దేశ విద్యార్థులకూ, ఉద్యమకారులకు అందించింది. ఈ జెన్ జడ్ ఉద్యమంలో ఢిల్లీలోని పి డి ఎస్ యు కార్యకర్తలూ చురుగ్గా పాల్గొన్నారు. పీ డి ఎస్ యు నిర్మాతలు కామ్రేడ్ జార్జిరెడ్డి, జెసియస్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరు ల విప్లవ పోరాట స్ఫూర్తితోనూ, నేటి ఢిల్లి జెన్ జడ్ ఉద్యమ స్ఫూర్తితోనూ విద్యార్థులంతా ఐక్యమై, ఉద్యమించాలని, పి డి ఎస్ యు పిలుపునిస్తుంది అని తెలిపారు.నెల్లూరు జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పిడిఎస్ యు అనేక పోరాటాలు చేసింది. వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని మరియు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని, సాంఘీక సంక్షేమ శాఖ ఆఫీసు నందు ఆందోళన చేయడం జరిగినది. ముఖ్యంగా నెల్లూరు సిటిలో వి.ఆర్.సి. కాలేజీలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజ్ ప్రారంభించాలని పీ డి ఎస్ యు డిమాండ్ చేస్తున్నది అని అన్నారు.ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో ఫీజుల దోపిడీ నియంత్రించాలని నెల్లూరు సిటిలో అనేక ఉద్యమాలు పి డి ఎస్ యు నిర్వహించింది అని తెలిపారు.శాశ్వతమైన, గౌరప్రదమైన ఉద్యోగం విద్యార్ధి హక్కు అనే నినాదంతోనూ; అన్ని స్థాయిల్లో మెస్‌చార్జీలు పెంచాలని కోరుతూ, పీజు రీయంబర్స్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా వున్న లక్షలాది పోస్టులను శాశ్వత పద్దతిలో భర్తీ చేయాలని కోరుతూ పి డి ఎస్ యు ఆధ్వర్యంలో సెప్టెంబరు 25న నెల్లూరులో జరిగే… మహా విద్యార్ధి ప్రదర్శనలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులంతా, జెన్ జడ్ స్ఫూర్తితో కదిలి రావాలని, జయప్రదం చేయాలని జిల్లా కార్యవర్గం పిలపునిస్తుంది అని తెలిపారు. ఈ మహాసభలకు పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు కె. భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజశేఖర్ ముఖ్య వక్తులుగా హాజరవుతారు. 26వ తేదీ అంబేద్కర్ భవన్లో ప్రతినిధుల సభ జరుగుతుంది అని తెలియజేశారు. కావున విద్యార్ధి విద్యార్థినులు సభకు హాజరై…సభను విజయవంతం చేయవలసినదిగా కోరారు.
