జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్., ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నిరంతరంగా డ్రగ్స్‌పై దండయాత్ర–2.0కు మరింత వేగం.

అవగాహన – గుర్తింపు – కఠిన చర్యలు – పునరావాసం అనే నాలుగు దిశల్లో తిరుపతి జిల్లా పోలీసుల సమగ్ర కార్యాచరణ.

​తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్., ఆదేశాలు, అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు మార్గదర్శకత్వంలో జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలనకు “డ్రగ్స్‌పై దండయాత్ర–2.0” కార్యక్రమం నిరంతరాయంగా సాగుతోంది. ఈ క్రమంలో రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాలు, విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహన, గుర్తింపు, కఠిన చర్యలు, పునరావాసం అనే నాలుగు దిశల్లో పోలీసులు సమగ్ర కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, గాజులమాండ్యం సీఐ ఎం. మంజునాథ రెడ్డి, ఎస్‌ఐ ఎస్. హరీష మరియు పోలీసు సిబ్బంది వినాయకపురం గ్రామ సమీపంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అనుమానితులకు ఆధునిక బయోచెక్ కిట్ల సహాయంతో శాస్త్రీయంగా గంజాయి పరీక్షలు నిర్వహించి, సరఫరా వ్యవస్థలోని ఫార్వర్డ్, బ్యాక్‌వర్డ్ లింకులను వెలికితీస్తూ విక్రేతలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రేణిగుంట పరిధిలోని పారిశ్రామిక, విమానాశ్రయ రక్షణ రంగాల్లో కీలకమైన కేంద్ర బలగాలైన సిఐఎస్ఎఫ్ బృందాల సమన్వయంతో మరియు వారి పటిష్టమైన నిఘా సహకారంతో ఈ తనిఖీలను మరింత బలోపేతం చేశారు. వ్యసనానికి గురైన యువతను మార్చడం సామాజిక బాధ్యతగా భావించి, పాపానాయుడుపేట రాస్కే కేంద్రం , స్విమ్స్, రుయా ఆసుపత్రుల ద్వారా పునరావాస సేవలు అందిస్తున్నారు. గంజాయి సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు భరోసా ఇచ్చారు.

జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్., సందేశం

​”తిరుపతి జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. మాదకద్రవ్యాల సరఫరాపై రాజీ లేని చర్యలు తీసుకుంటూనే, వ్యసనపరుల పునరావాసానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ నిర్మూలన ప్రక్రియలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలి. యువతను రక్షించడం అంటే మన సమాజ భవిష్యత్తును రక్షించడమే.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *