జియ్యమ్మవలస/పార్వతీపురం/మనధ్యాస నవంబర్ 25 : సాహితీ వేత్తలకు పుట్టినిల్లు పార్వతీపురం మన్యం జిల్లా అని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ ఎక్కువ మంది కవులు, సాహితీవేత్తలు, రచయితలు ఉండటం గర్వకారణమని అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పార్వతీపురం మన్యం పుస్తక మహోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించి మాట్లాడారు. కృత్రిమ మేధస్సును ఎదుర్కోవాలంటే ఊహాశక్తి అవసరమని, అది కేవలం పుస్తక పఠనం ద్వారానే లభిస్తుందని అన్నారు. కేవలం సర్టిఫికేట్లు, నూటికి నూరు మార్కులు సాధించడం ద్వారా విద్యార్థులు గొప్పవారు కాలేరని, పాఠ్యపుస్తకాలకు మించిన జ్ఞానాన్ని సంపాదించినప్పుడే మానవ మేధస్సు వికసిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.పార్వతీపురం మన్యం జిల్లాకు సహజ సిద్ధమైన సాహిత్య, సాంస్కృతిక వాతావరణం ఉందని, ఇక్కడ గొప్ప కవులు, రచయితల లక్షణాలు మెండుగా ఉన్నారని అన్నారు. జిల్లాలోని కవులు, రచయితలు, కళాకారులు, అన్ని రంగాలకు చెందిన వారి వివరాలను సేకరించి ఒక డైరీని రూపొందిస్తున్నామని తెలిపారు.దీనివల్ల భవిష్యత్తులో వారికి ఆహ్వానాలు పంపడానికి, వారిని కలుపుకుపోవడానికి వీలవుతుందని అన్నారు. జిల్లాలో కేవలం అప్పుడప్పుడే కాకుండా, నిరంతరం సాహిత్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేలా ఒక రూపకల్పన చేస్తున్నామని, దీనికోసం జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాబోయే 10 రోజుల పాటు జరిగే ఈ పుస్తక మహోత్సవాన్ని, సాహిత్య సభలను ప్రజలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం థింసా నృత్యం చేసిన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులను ఎస్పీతో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యస్.వి.మాధవ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు గొప్ప సాహిత్య చరిత్ర ఉందని, ఎంతోమంది గొప్ప కవులు, రచయితలు, కళాకారులు, సంగీతకారులు ఈ ప్రాంతం నుండి వచ్చారని గుర్తుచేశారు. అందరిలో ఆలోచన శక్తి పెరగాలంటే పుస్తక పఠనం తప్పనిసరి అని అన్నారు. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయడం వల్ల వారిలో హేతుబద్ధమైన ఆలోచన పెరుగుతుందని, మంచి, చెడులను ఆలోచించే శక్తి వస్తుందన్నారు. అలాగే పుస్తకాలు చదవడం వల్ల సహనం పెరుగుతుందని, ఎదుటివారు తప్పు చేసినప్పుడు దాన్ని అర్థం చేసుకుని సరిదిద్దే గుణం అలవడతాయని తెలిపారుప్రముఖ కవి,రచయిత గంటేడ గౌరు నాయుడు, ప్రముఖ కవి, కళాకారుడు రౌతు వాసుదేవరావు, కేంద్ర సాహిత్య ఆవార్డు గ్రహీతలు బెలగాం భీమేశ్వరరావు, నారంశెట్టి ఉమామహేశ్వర రావు, సాహితి స్రవంతి చీకటి దివాకర్ పాల్గొని పుస్తక పఠనం ద్వారా లభించే సృజనాత్మకతను వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సాహితి లహరి మంచుపల్లి శ్రీరాములు, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ డా. ఎం.శ్రీరాములు, డీవిఈఓ వై.నాగేశ్వరరావు, సామాజిక వేత్త జట్టు పద్మజ, తదితరులు పాల్గొన్నారు.