మన ధ్యాస సౌలూరు నవంబర్ 19:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సాలూరు మండలం పెదబోరబందలో బుధవారం జరిగిన రీసర్వే గ్రామసభలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతుల పేరున ఉన్న భూమిని పైసా ఖర్చు లేకుండా సమగ్ర వివరాలు, నిర్దిష్టమైన కొలతలతో ఆన్ లైన్ నందు నమోదు చేయడం జరిగిందని అన్నారు. గతంలో రెవిన్యూ రికార్డుల్లో భూ వివరాలు సక్రమంగా లేనందున, క్రయ, విక్రయ సమయంలో రైతులు సమస్యలు ఎదుర్కోవలసి వచ్చిందని గుర్తుచేసారు. చట్ట ప్రకారంగా సాగు చేసుకునే భూమికి సంబంధించిన రికార్డు రైతుల వద్ద ఉండాలని, అందుకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉండాలని అన్నారు. తద్వారా ఆ భూమిపై సర్వ హక్కులు కలిగి ఉంటారని, ఈ విషయాన్ని అందరూ గుర్తెరగాలని అన్నారు. ఆ విధమైన రికార్డులు గతంలో లేనందున సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కావున ప్రతీ రైతు వారి భూమికి సంబంధించిన రికార్డు ఉండేలా చూసుకోవాలని సూచించారు. గతంలో సరిహద్దు రాళ్లు ఉండేవని, వాటిని తొలగించి ఆక్రమణ జరిగేందుకు అవకాశం ఉండేదని అన్నారు. ప్రస్తుతం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం జరిగిందని, దీని ద్వారా సరిహద్దు రాళ్లు లేనప్పటికీ ఖచ్చితత్వంతో కూడిన భూవివరాలు ఆన్ లైన్ నందు ఉంటాయని అన్నారు. రీసర్వే తర్వాత రైతులకు వారి భూమిపై పూర్తి, శాశ్వత హక్కులు లభిస్తాయని, కొత్తగా జారీ చేయబోయే పట్టాదారు పాసుపుస్తకాలతో భూమి క్రయ విక్రయాలు, బ్యాంకు రుణాలు సులభంగా పొందవచ్చని అన్నారు. ప్రతి ఏడాది 1బి అడంగల్ కాపీ సచివాలయంలో తీసుకోవాలని, ఈరోజు అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాబడతాయని అన్నారు. రబీలో సాగు భూములను ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పంట వేయాలని, తద్వారా అధిక ఆదాయం వస్తుందని అన్నారు. అదేవిధంగా లాభసాటి వాణిజ్య పంటల దిశగా రైతులు ఆలోచన చేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది మాట్లాడుతూ గ్రామంలో ఉన్న అందరి భూములకు రీసర్వే పారదర్శకంగా చేయడం జరిగిందని అన్నారు. ఇప్పుడు మీకిచ్చిన భూమి కొలతలను సరి చూసుకోవాలని, ఇందులో కూడా ఏమైనా లోపాలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకువస్తే, వాటిని పునఃపరిశీలించి సరిచేయాలని సర్వే అధికారిని ఆదేశించారు. సర్వే మరియు భూరికార్డుల అధికారి పి.లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ గ్రామంలో ఉన్న 814 మంది రైతులకు సంబంధించిన భూమిని పూర్తిగా సర్వే చేయడం జరిగిందని అన్నారు. వెబ్ ల్యాండ్ ప్రకారంగా 1,529 ఎకరాల 70 సెంట్లు ఉండగా, రీసర్వే అనంతరం 1,513 ఎకరాల 5 సెంట్లుగా తేలిందని అన్నారు. ఈ రీసర్వేలో పూర్తయినవన్నీ కూడా ఖాతాల వారీగా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, సర్వే మరియు రెవెన్యూ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.








