

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, అచ్చంపేట పరిధిలో గల నర్సింగరావుపల్లి ఎరువుల గోదామును ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోదాములో 71 యూరియా బస్తాలు నిల్వ ఉన్నట్లు గుర్తించారు.కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా వ్యవస్థను అమలు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.ప్రైవేట్ షాపులు, ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా సరఫరా సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు.జిల్లా చెక్‌పోస్టుల వద్ద కఠిన భద్రతా చర్యలు చేపట్టి మన జిల్లాకు కేటాయించిన యూరియా రైతులకు మాత్రమే అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.అదేవిధంగా నానో యూరియా వినియోగం పెంచాలని రైతులను చైతన్యవంతం చేయాలని సూచించారు.500 మిల్లీలీటర్ల నానో యూరియా, 45 కిలోల యూరియా బస్తాకు సమానమని,అదనపు రవాణా ఖర్చులు లేకుండా డ్రోన్ ద్వారా సులభంగా పిచికారి చేయవచ్చని ఆయన తెలిపారు.ప్రాథమిక వ్యవసాయ సంఘాలు తమ సొసైటీల వద్ద రైతుల రద్దీ లేకుండా ముందస్తు షెడ్యూల్ ప్రకటనతో యూరియా పంపిణీ నిర్వహించాలని సూచించారు. రైతుల పాస్‌బుక్ ఆధారంగా మాత్రమే అవసరమైన మోతాదులో యూరియా ఇవ్వాలని అధికారులు దృష్టి సారించాలి అని కలెక్టర్ ఆదేశించారు.అలాగే సబ్సిడీ యూరియా పక్కదారి పట్టకుండా పరిశ్రమలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలరు,ఈ తనిఖీలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి,జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి, తహసిల్దార్ భిక్షపతి, ఏవో అమర ప్రసాద్, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి సొసైటీ సీఈఓ సంగమేశ్వర్,తదితరులు పాల్గొన్నారు.
