


మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమవారం రాత్రి నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 75,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. వెంటనే అధికారులు స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడకి చేరుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు అధికారులతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేసి 58,500 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న మంజీరా నదిలోకి విడుదల చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1403.25 అడుగుల 15.323 టీఎంసీలు నీరు నిల్వ ఉందని అన్నారు. అదేవిధంగా వర్షాభావంతో వాగులు, వంకలు కూడా ప్రవహిస్తున్నందున ప్రజలు, రైతులు, పశువుల గొర్రెల కాపరులు ఎవరు నీటి ప్రవాహంలోకి, కాలువలలోకి దిగరాదని అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ ఈఈ సోలోమన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సాయి పటేల్, ఏఈఈ శివప్రసాద్, ఏఈ సాకేత్, ఎస్ఐ శివకుమార్ అన్నారు.
