మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 8:
మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభ తూతూ మంత్రంగా ముగిసింది. పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేసినప్పటికీ, గ్రామానికి ప్రత్యేక అధికారి అయిన పంచాయతీరాజ్ శాఖ సాయితేజ ఒక్కసారి కూడా గ్రామపంచాయతీని సందర్శించకపోవడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులు స్పందించకుండా ఉండటంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మురికినీళ్ల కాలువలు శుభ్రం చేయడం లేదని,ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలమైనప్పటికీ ఇప్పటివరకు తొలగించలేదని మండిపడ్డారు.
గ్రామసభలో విద్యుత్‌శాఖ అధికారులు హాజరు కాకపోవడం కూడా గ్రామ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపించారు. ట్రాన్స్‌ఫార్మర్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా స్పందన లేకపోవడం దురదృష్టకరమని చెప్పారు.త్వరలో సమస్యలు పరిష్కరించకపోతే ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.ఆశా కార్యకర్తలు గ్రామంలో తిరుగుతూ సీజన్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు.ప్రజలకు అవసరాల నిమిత్తం బీపీ షుగర్ టాబ్లెట్లు అందిస్తున్నామని తెలిపారు.గ్రామ సమస్యలను పరిష్కరించే చర్యలు తీసుకుంటాం,అని పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ హామీ ఇచ్చారు.గ్రామంలో తిరిగి సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రత్యేక అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వెంకట్ రాములు, గ్రామ అధ్యక్షుడు నిఖిల్, కారోబార్ లింగాల రాములు, ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజు, ఆశావర్కర్లు నస్రిన్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.









