

మన న్యూస్: పినపాక, శరీరంలోని రక్తంలో ఏర్పడే అపసవ్యత సికిల్ సెల్ అంటారని ఇది వంశపారంపర్యంగా వచ్చేవ్యాధి అని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు దుర్గా భవాని తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని పాతరెడ్డిపాలెం సబ్ సెంటర్ పరిధిలో జరుగుతున్న సికిల్ సెల్ పరీక్షలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ వ్యాధికి గురైనవాళ్లలో ఎర్రరక్త కణాలు ప్రత్యేకమైన సికిల్ (కొడవలి) రూపాన్ని సంతరించుకుంటాయన్నారు. అవి సాధారణంగా 125 రోజులు బతకాల్సి ఉండగా 25 రోజుల్లోపే చనిపోతాయని దానివల్ల న్యుమోనియా, తీవ్రమైన కీళ్లనొప్పులు, అవయవాల వాపులు, స్ట్రోక్… వంటివి వ్యాధి లక్షణాలలు కనిపిస్తాయని తెలిపారు. సరైన చికిత్స చేయనట్లయితే శరీరంలోని పలు అవయవాలను ఇది దెబ్బతీస్తుందని గ్రామస్తులకు ఆమె వివరించారు. ఇటీవల జాతీయ ఆరోగ్య సర్వే ప్రకటించిన వివరాలను బట్టి చూస్తే రాష్ట్రంలోని చిన్నారులు పెద్ద సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియా బారిన పడుతున్నారన్నారు. సరైన అవగాహనలేక, గుర్తించడంలో ఆలస్యం వల్ల అనేకమంది బాధితులుగా మారుతున్నారని సికిల్ సెల్ పరీక్షలకు ప్రజలు సహకరించాలని కోరారు. 2047 సంవత్సరానికల్లా సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. సికిల్ సెల్ వ్యాధి అనేది ఒక జన్యు రక్త వ్యాధి అని ఇది బాధిత రోగి యొక్క మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. ఇది భారతదేశంలోని గిరిజన జనాభాలో సర్వసాధారణం కానీ గిరిజనేతరులలో కూడా సంభవిస్తుందన్నారు. ఈ కార్యక్రమం సున్నా నుండి 18 సంవత్సరాల వయస్సు వరకు మొత్తం జనాభాను కవర్ చేసే మిషన్ మోడ్‌లో నిర్వహించబడుతుందన్నారు. అనంతరం పినపాక మండల పరిధిలోగల ఎల్సిరెడ్డిపల్లి, మినీ గురుకులం పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. విద్యార్థులందరూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. అనారోగ్య సమస్యలు ఉంటే వార్డెన్ సహాయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావాలని సూచించారు. ఫుడ్ పాయిజన్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.