

- జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సిహెచ్ వి ప్రసాద్..
కాకినాడ, పెదపూడి మన న్యూస్ ప్రతినిధి:- గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలను ప్రతి ఇంటికీ చేరువ చేయడం ద్వారా ఆర్థిక చైతన్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రారంభించిన స్యాచురేషన్ క్యాంపులు గ్రామీణులలో మంచి స్పందనను పొందుతున్నాయి. జూలై 1వ తేదీ నుంచి మూడు నెలల పాటు ఈ క్యాంపులు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనున్నట్లు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సిహెచ్.వి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమం స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు నాబార్డ్, యూనియన్ బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో సమన్వయంగా అమలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామంలో శనివారం నిర్వహించిన క్యాంపు సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలు అందని వర్గాలకు చేరవేయడం, ఖాతా లేని వారికి కొత్త ఖాతాలు ప్రారంభించడం, నిష్క్రియతలో ఉన్న అకౌంట్లను యాక్టివ్ చేయడం, పీఎం సురక్షా బీమా యోజన, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి నమోదు చేయడం వంటి కార్యకలాపాలు ఈ క్యాంపుల ద్వారా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.కాకినాడ జిల్లాలోని మొత్తం 385 గ్రామ పంచాయతీల్లో మూడు నెలల పాటు ప్రతి శుక్రవారం DFS క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామస్థుల ఆర్థిక అవసరాలపై అవగాహన పెంపొందించడంతో పాటు అందరికీ బ్యాంకింగ్ సేవలు చేరేలా ఈ కార్యక్రమం రూపొందించబడినదని వివరించారు. ఈ క్యాంపులు అన్ని బ్యాంకుల సహకారంతో వివిధ గ్రామాల్లో జరుగుతాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌సి మేనేజర్ అప్పారెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ బి అయ్యప్ప రెడ్డి, , సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్లు శ్రీను రాజకుమార్ , గ్రామస్థులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.