

Mana News;- తిరుపతి నవంబర్ 19(మన న్యూస్ )*క్రీడావసతుల కల్పనపై రాష్టప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, రిజిష్ట్రార్ భూపతినాయుడుతో మంగళశారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ రవినాయుడు క్రీడావసతుల కల్పనకు సంబంధించిన అంశాలపై వీసీకి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖేలో ఇండియా నిధులను వినియోగించి యూనివర్సిటీలో క్రీడారంగం అభివృద్ధికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని కోరారు. అలాగే శ్రీశ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్రీడాకారులకు హాస్టల్ సదుపాయం లేదని, క్రీడా వసతి గృహం ఏర్పాటుకు సహకరించాలని కాంక్షించారు. తిరుపతి వేదికగా క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలో స్పోర్ట్స్ అకాడమీని కూడా తిరుపతిలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. స్పోర్ట్స్ అథారిటీ, యూనివర్సిటీ సమిష్టి కృషితో తిరుపతి జిల్లాలో క్రీడారంగాన్ని పరుగులు పెట్టించవచ్చని కోరారు. దీనిపై వీసీ అప్పారావు బదులిస్తూ యూనివర్సిటీ పరిధిలో స్పోర్ట్స్ హాస్టల్‌కు అనుకూలంగా ఉన్న భవనాలను పరిశీలిస్తామని, అనుకూలంగా ఉంటే వాటిని త్వరితగతిన ఆధునీకరించి డీఎస్ఏకు అందజేస్తామన్నారు. అలాగే క్రీడారంగాభివృద్ధికి యూనివర్సిటీ నుంచి పూర్తిసహాయసహకారాలను అందిస్తామని శాప్ ఛైర్మన్ కి వైస్ ఛాన్సలర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీడీఓ సయ్యద్ సాహెబ్, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. *అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల వినతి..*తిరుపతి డీఎస్ఏకు విచ్చేసిన శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల ఉద్యోగుల సంఘ సభ్యులు శ్రీశ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్సులో కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాప్ ఛైర్మన్ గార్కి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని శాప్ ఛైర్మన్ గారు వారికి హామీ ఇచ్చారు.