

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మక్తల్ నియోజవర్గ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటనకు మూల కారణం మాజీ ఎమ్మెల్యేచిట్టెం రామ్మోహన్ రెడ్డి అని, గత ప్రభుత్వ హయాంలోనే ఫుడ్ పాయిజనింగ్ జరిగినా అప్పుడే వంట కాంట్రాక్ట్ వ్యక్తులపై చర్యలు తీసుకోలేదని, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అప్పుడే సదరు కాంట్రాక్టర్ ను తొలగించాలని నిరసన తెలిపినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే మరోసారి ఫుడ్ పాయిజనింగ్ పునరావృతం అయ్యేది కాదని అన్నారు.
ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆగమేఘాల మీద స్పందించి విద్యార్థులను ఆసుపత్రికి తరలించి సరైన చికిత్స అందించారని, ఈ ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. ఇక అభివృద్ధి విషయానికి వస్తే గత 20 ఏళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగనందునే,స్థానికుడైన వాకిటి శ్రీహరిని ప్రజలు ఎమ్మెల్యేగా పట్టం కట్టారని అన్నారు. గతంలో అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితమైందని, వారి హయాంలో ఎందుకు సంగంబండ బండరాయి పగలగొట్టలేదని, వంద పడకల ఆసుపత్రి ఎందుకు నిర్మించలేదని, మక్తల్ లో కోర్టు ఎందుకు ప్రారంభం కాలేకపోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాగితాలకే పరిమితమైన అభివృద్ధిని తాము పట్టాలెక్కిస్తున్నామని, గత ప్రభుత్వంలో చేసినట్టుగా కేవలం శంకుస్థాపనకే పరిమితం కాబోమని, అన్నిటినీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. గత 20 ఏళ్లుగా వారికి నర్వలో జూనియర్ కాలేజ్ ప్రారంభించాలని ఎందుకు అనిపించలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నర్వ జూనియర్ కాలేజీ అనుమతులు వచ్చి త్వరలో ప్రారంభం కానుందాని తెలిపారు. డయాలసిస్ సెంటర్ సైతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అందుబాటులోకి వచ్చినా.. మక్తల్ లో మాత్రం ఏర్పాటు కాలేదని, కాంగ్రెస్ పాలనలోనే మక్తల్ లో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించుకున్నామని, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటులో జాప్యం జరిగిందని కేవలం 15 రోజుల్లో అన్ని పూర్తి చేసి డయాలసిస్ సెంటర్ సేవలను మక్తల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. ఇక మాగనూరు మండలం అచ్చంపేట, కృష్ణ మండలం గురజాల్ ఇలాంటి ఎన్నో గ్రామాలకు గత 20 ఏళ్లలో కనీసం బీటీ రోడ్లు వేయలేకపోయారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా గ్రామాలకు బీటీ రోడ్లు అనుమతులు వచ్చి వారికి రవాణా సౌకర్యం సాలభ్యం గా మారుతోందని అన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు దిశగా మంత్రి జూపల్లిని తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చర్యలు చేపడుతున్నారని ప్రశంసించారు. త్వరలోనే అన్ని మండలాలకు సబ్ స్టేషన్లు మంజూరు కానున్నాయని, ఎంతో కాలం నుంచి పెండింగ్లో ఉన్న నారాయణపేటకు రహదారి పనులు సైతం త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. కేవలం పద్నాలుగు నెలల్లోనే మూడు కోట్లకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అని, ఇంత తక్కువ కాలంలో గతంలో ఏ మేరకు నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి విషయంలో సహకరించాలని, కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని, మక్తల్ ప్రాంత అభివృద్ధి కోసం ఎవరు సలహాలు సూచనలు ఇచ్చినా వాటిని ఎమ్మెల్యే స్వీకరిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చేపడుతున్న అభివృద్ధి పనులపై ఎవరైనా అవాకులు చవాకులు పేలితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్టా సురేష్ గుప్తా, మండల అధ్యక్షులు గణేష్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ బోయ రవికుమార్, చంద్రకాంత్ గౌడ్, ఆనంద్ గౌడ్, గొల్లపల్లి నారాయణ, శివరాం రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు శ్రీనివాసులు, ఫయాజ్, నాయకులు వల్లంపల్లి లక్ష్మణ్, చిన్న నర్సిములు, మందుల నరేందర్, వాకిటి శ్యామ్, రవికుమార్, అశోక్ గౌడ్, శేఖర్ , బహదూర్, రాములు,ఆనంద్, రాము ,రత్న కుమార్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
