• క్రీడా రంగ అభివృద్ధికి మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవ.

మన ధ్యాస,మక్తల్: పట్టణాన్ని క్రీడా రంగంలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మక్తల్ పట్టణంలో 25 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న అధునాతన స్టేడియం కోసం క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంకతో కలిసి సోమవారం మక్తల్ గ్రౌండ్‌లో స్థలాన్ని పరిశీలించారు.అన్ని రకాల క్రీడలకు అనువుగా, ఆధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన వసతులతో స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. స్టేడియం నిర్మాణానికి అడ్డుగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇండోర్ స్టేడియం భవనాల తొలగింపుపై కలెక్టర్‌కు పలు సూచనలు చేశారు.గత ప్రభుత్వ హయాంలో సరైన ప్రణాళిక లేకుండా డిగ్రీ కళాశాల, ఇండోర్ స్టేడియం భవనాలను నిర్మించారని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇరిగేషన్ కార్యాలయం వద్ద అన్ని మౌలిక సదుపాయాలతో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.ప్రస్తుత గ్రౌండ్‌లో ఉన్న కళాశాల, ఇండోర్ స్టేడియం భవనాలను తొలగించి, స్టేడియం నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ప్రియాంక తో కలిసి మంత్రి ఖేలో ఇండియా బ్రోచర్లను ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *