
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన,స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న అమరజీవి జలధార జల జీవన మిషన్ వాటర్ గ్రిడ్ పథకం పనులకు శంకుస్థాపన కార్యక్రమం పెరవలి వద్ద ఘనంగా జరిగింది.వేల కోట్ల రూపాయల నిధులతో నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి గ్రామం సమీపంలో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌కు వరుపుల సత్యప్రభ రాజా,ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి,శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా నీటి కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె అన్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గంలో పలు సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రస్తావించి నిధులు కేటాయించాలని కోరారు.