• సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర

శంఖవరం/జగ్గంపేట మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో 42 వేల ఎకరాల భూమి తాళ్లూరు పుష్కర ఎత్తిపోతల పథకం నీటిపై ఆధారపడి ఉంది. 2023 సంవత్సరంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల పంటలకు పూర్తిగా పెట్టుబడి పెట్టిన తరువాత పుష్కర నీరు ఇవ్వకపోవడం వల్ల సుమారు 30 వేల ఎకరాలలో పంటలు పూర్తిగా ఎండిపోయి తీవ్ర నష్టంతో రైతన్నలు అప్పులు పాలైనట్లు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతులు అందరి పక్షాన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమం ద్వారా సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతన్నలకు పూర్తిస్థాయిలో నీరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, గెలిచిన వెంటనే శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గత సంవత్సరం 2024 ఇదే రోజుల్లో తాళ్లూరు పుష్కర పంపు హౌస్ వద్ద మీడియా సమావేశం ద్వారా 50 కోట్ల నిధులతో పైపులైన్ మారుస్తానని, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మత్తులు చేయించి పూర్తిస్థాయిలో సాగునీరు ఇస్తామని ఈ ఒక్క పంటకు విరామం ఇవ్వాలని రైతులను కోరారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిధులు తెస్తానని, పైపులైను మారుస్తానని, ఆధునీకరణ చేస్తానని రైతన్నలకు మాట ఇచ్చి సంవత్సర కాలమైనా నేటికీ నిధులు లేవు,పైప్లైన్ మార్చలేదన్నారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా రైతులు పంటలు వేయడానికి సిద్ధపడుతున్న పరిస్థితుల్లో జగ్గంపేట నియోజకవర్గంలో పుష్కర మీద ఆధారపడిన ఆయకట్టు రైతులకు పంటకు నీరిస్తారా? ఇవ్వరా? నారుమడులు వెయ్యాలా? వద్దా? అనే సందిగ్ధంలో, అయోమయ పరిస్థితిల్లో రైతన్నలు ఆందోళనలో ఉన్నారని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. పుష్కర ఆయకట్టులో ఉన్న 42 వేల ఎకరాలకు నీరు ఇస్తున్నారా? లేదా? నీరు ఇవ్వని పక్షంలో నేలతల్లిని నమ్ముకున్న 42 వేల ఎకరాల రైతులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది. 42,000 ఎకరాల భూమి ద్వారా వ్యవసాయ పనులపై ఆధారపడిన సంబంధిత గ్రామాల వ్యవసాయ కూలీలను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది. 42 వేల ఎకరాల ద్వారా వచ్చే పశుగ్రాసం (ఎండుగడ్డి)మీద ఆధారపడిన సంబంధిత గ్రామాలలో ఉన్న వేలాది పశువులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది.పై విషయాలపై వెంటనే స్పందించి అధికారికంగా స్పష్టతను ఇవ్వాలని కోరారు.అన్నం పెట్టే రైతన్నలను ఆందోళన పరచవద్దని,పంట సమయం ఆసన్నమైందని అశ్రద్ధ చేయకుండా వెంటనే స్పందించాలని మీడియా ద్వారా శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ ని మరియు సంబంధిత అధికారులను పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. రైతులకు అన్యాయం చేస్తే రైతుల పక్షాన రైతులకు అండగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాడతామని సూర్యచంద్ర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *