

వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు
మనన్యూస్,పాచిపెట:రైతులు సాంప్రదాయ పంటలను విడిచిపెట్టి తక్కువ పెట్టుబడి తో అధిక లాభాలు వచ్చే పంటల వైపు మారాలని పాచిపెంట మండల వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు కోరారు.బుధవారం నాడు అమ్మ వలస గ్రామం లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే నిమ్మగడ్డి సాగు దిశగా ఆలోచనలు చేయాలని ఎలాంటి పంటలు పండని బీడు భూములలో సైతం నిమ్మ గడ్డి సాగు తో లాభాలు పొందవచ్చని తెలిపారు.చాలామంది రైతులు పత్తి పంటను వర్షాధారంగా వెయ్యడం వలన నాలుగు క్వింటాళ్లు మించి దిగుబడి రావట్లేదని అంతిమంగా కనీసం 10 వేల రూపాయల ఆదాయం కూడా ఉండట్లేదని కాబట్టి రైతులు పత్తి స్థానంలో మరియు ఇతర ఏ పంటలు పండని బీడు భూములలో నిమ్మ గడ్డి సాగు చేపట్టవచ్చని సూచించారు.ఎకరానికి ఒక కోతలో 10 కిలోల నూనె వస్తుందని సంవత్సరానికి నాలుగు లేదా ఐదు కోతలు తీయవచ్చని ఒక సంవత్సరం వేసుకుంటే 10 సంవత్సరాల వరకు ఉంటుందన్నారు.ఒక కేజీ నూనె కనీసం వెయ్యి రూపాయలు ధర పలుకుతుందని అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చని తెలిపారు.అంతేకాకుండా 100 ఎకరాల క్లస్టర్ ఏర్పాటు చేసినట్లయితే ఉచితంగా నూనె తీసే యంత్రాన్ని జిల్లా కలెక్టర్ వారు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.రాయి గుడ్డి వలస రైతులు ఇప్పటికే ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారని కాబట్టి అమ్మ వలస గ్రామ చుట్టుపక్కల రైతులు కూడా ఆలోచన చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు మోహన్ కృష్ణ ఏపీ సీఎం ఎఫ్ ఎల్ టు విజయ్ పాల్గొన్నారు.