

మన న్యూస్ వెదురుకుప్పం :- వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఘనంగా జరిగింది. కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల తో పాటు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రధాన భూమిక పోషిస్తారని కళాశాల ప్రిన్సిపాల్ బి. అన్నపూర్ణ శారద ఈ కార్యక్రమంలో అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలోఉపాధ్యాయుల పాత్ర ఎంత కీలకమొ, తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే కీలకమైనదని ఆమె అన్నారు. తల్లిదండ్రులు తరచుగా కళాశాలకు విచ్చేసి తమ పిల్లలు కళాశాలకు సక్రమంగా వస్తున్నారా లేదా అని తెలుసుకోవడం చాలా అవసరం అని ఆమె అన్నారు. ప్రస్తుత ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం అతి ముఖ్యమైనదని, కళాశాలలో ఎంపీ లాడ్స్ ఫండ్స్ తో మంచి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు అయిందని దానిని విద్యార్థులు సక్రమంగావినియోగించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె అన్నారు. పేరెంట్స్ టీచర్స్ కమిటీ కోఆర్డినేటర్ వి. ప్రభాకరరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు తరచుగా అధ్యాపకులతో నేరుగా గాని లేదా మొబైల్ ద్వారా గాని మాట్లాడుతూ వాళ్ళ పిల్లల హాజరు గురించి మరియు చదువులో వారి అభివృద్ధి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. మనదేశంలో అపారమైన యువత ఉందని, ఆ యువత సక్రమంగా విద్యాబుద్ధులతో అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రసన్న లత మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యావంతులు కాకపోయినా వారి పిల్లలు ఇంట్లో ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో చదువుతున్నారా లేదా అని గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ వెంకటేశు మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులని అందువల్లనే వారు పిల్లలకు చిన్నతనం నుంచి పెద్దలను, గురువులను గౌరవించడం నేర్పాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు మాట్లాడుతూ మా ప్రాంతంలోనె ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉండడం మా అదృష్టమని అన్నారు. గతంలో డిగ్రీ కళాశాలలో చదవాలంటే వ్యయ ప్రయాసాలకు ఓర్చి పిల్లలు చాలా దూరం వెళ్లవలసి వచ్చేదన్నారు. పిల్లల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందానికి వారు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి, మంగళ గౌరీ మొదలగువారు ప్రసంగించారు.
ఈ సమావేశంలో ఇతర అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
