నిజాంసాగర్‌, అక్టోబర్‌ 1 (మన ధ్యాస): మంజీరా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణలో భూములు కోల్పోతున్న వడ్డేపల్లి, జక్కాపూర్‌ గ్రామాలకు చెందిన రైతులు బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రస్తుత భూముల విలువలకు అనుగుణంగా ఎకరానికి రూ.30 లక్షల పరిహారం అందించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రైతులు మాట్లాడుతూ.. మంజీరా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తమ విలువైన వ్యవసాయ భూములను కోల్పోతున్నామని తెలిపారు. భూములపై ఆధారపడి జీవిస్తున్న రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని న్యాయమైన పరిహారం అందించాలని కోరారు.గతంలో భూసేకరణ చేసిన సమయంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.17 లక్షల పరిహారం అందించారని రైతులు తెలిపారు. ప్రస్తుతం భూముల విలువలు పెరిగినందున ఆ పరిహారం సరిపోదని, ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఎకరానికి రూ.30 లక్షల పరిహారం అందించాలని ఆర్డీవో రవీందర్‌రెడ్డిని కోరారు.
అదేవిధంగా మంజీరా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పరిధిలోని వడ్డేపల్లి, జక్కాపూర్‌, మాగి, వల్లూరు, గోర్గల్‌ గ్రామాలు సస్యశ్యామలం అయ్యేందుకు ఏర్పాటు చేసిన చిన్న లిఫ్ట్‌ను కూడా త్వరగా ప్రారంభించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. లిఫ్ట్‌ ప్రారంభమైతే ఆయా గ్రామాల్లో సాగునీటి సౌకర్యం మెరుగుపడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.భూసేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా, న్యాయమైన పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆర్డీవోను విజ్ఞప్తి చేశారు.రైతుల విజ్ఞప్తులను బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డి సానుకూలంగా విని, సంబంధిత అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు రైతులు పేర్కొన్నారు.ఈ సమావేశంలో వడ్డేపల్లి, జక్కాపూర్‌ గ్రామాలకు చెందిన పలువురు రైతులు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సాయి భుజంగారావు,తదితరులు ఉన్నారు

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *