మొహమ్మద్‌నగర్, సెప్టెంబర్ 28 (మన న్యూస్): మొహమ్మద్‌నగర్ మండలంలోని గున్కుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోమవారం మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీకి సంబంధించిన ఆదాయ, వ్యయ వ్యవహారాలను సొసైటీ సీఈఓ సాయి తేజ రైతులకు చదివి వినిపించారు.
అనంతరం సొసైటీ చైర్మన్ వాజీద్ అలీ మాట్లాడుతూ.. గున్కుల్ సొసైటీ పరిధిలో 1,350 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు 150 మందికి మాత్రమే రైతు రుణమాఫీ జరిగిందని, మిగతా రైతులకు కూడా రుణమాఫీ వర్తించేలా చూడాలని కోరారు. సొసైటీ ఆధ్వర్యంలో రూ.కోటి డిపాజిట్ చేయడం జరిగిందని తెలిపారు. ప్యాడీ సెంటర్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి సొసైటీకి రూ.30 లక్షలు రావాల్సి ఉందని పేర్కొన్నారు.గున్కుల్ సొసైటీ ఎఫ్టీఓ కింద ఎంపికైందని చైర్మన్ తెలిపారు. ఇందులో భాగంగా సొసైటీకి సంబంధించిన సభ్యులు 750 మంది ఉన్నారని, ప్రతి సభ్యుడు రూ.2 వేల చొప్పున సభ్యత్వం తీసుకుంటే భవిష్యత్తులో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పెట్రోల్ బంక్ ద్వారా వచ్చే లాభాలను 750 మంది సభ్యులకు పంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే యూరియా యాప్ ద్వారా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యాప్ విధానాన్ని తొలగించి రైతులకు సులభంగా ఎరువులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రమేష్ యాదవ్, సర్పంచులు బోయిని హరిణ్ కుమార్ ,గజ్జల జీవన్,ఉపాధ్యక్షుడు జి. నర్సింలు, డైరెక్టర్లు యం. రమేష్ గౌడ్,బాలబోయి,గంగారెడ్డి,అంజవ్వ,బషీర్,కృష్ణారెడ్డి,అంబర్ సింగ్,సిద్ధిరాములు నాయకులు ఆకాష్,విజయ్ ,తదితరులు పాల్గొన్నారు.
