మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద అభివృద్ధి చేస్తున్న ఎకో టూరిజం పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న డీలక్స్ కాటేజీలు, సూట్ కాటేజీలు, స్పా, యోగా సెంటర్, రెస్టారెంట్, బాంక్వెట్ హాల్ తదితర నిర్మాణాలను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. నిజాంసాగర్‌ను తెలంగాణలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి వచ్చే ఆగస్టు నెల నాటికి ఎకో టూరిజం ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పర్యాటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
అనంతరం నిజాంసాగర్ ఆయకట్టుకు సాగునీటి విడుదల అంశంపై మాట్లాడుతూ, శివం కమిటీ త్వరలో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ సమావేశం అనంతరం సాగునీటి విడుదలపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్ రవితేజ, బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, డీఆర్డీఓ దామోదర్, జిల్లా పర్యాటక అధికారి వెంకటేశ్వర్ గౌడ్, టూరిజం డీఈ విద్యాసాగర్, టూరిజం ఏఈ సోహెల్, ఈఈ కెన్యా నాయక్, మండల ప్రత్యేక అధికారి కుటుంబరావు, తహసీల్దార్ సాయి భుజంగరావు, ఎంపీడీవో శివకృష్ణ, ఎంఈఓ తిరుపతి రెడ్డి, ఎంపీఓ అనితారెడ్డి, నీటిపారుదల శాఖ ఏఈలు సాకేత్, అక్షయ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
