గుంతకల్, మన ధ్యాస: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణ న్యాయస్థానంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో కోర్టు వర్గాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు.కోర్టు కార్యకలాపాలు రద్దీగా సాగుతున్న సమయంలో నేరుగా మెజిస్ట్రేట్‌కు అపరిచితుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. “కోర్టు ఆవరణలో బాంబు ఉంది.. జాగ్రత్త” అంటూ హెచ్చరించి అవతలి వ్యక్తి కాల్ కట్ చేసినట్లు సమాచారం.దీనితో వెంటనే అప్రమత్తమైన న్యాయమూర్తి పోలీసులకు సమాచారం అందించారు. భద్రతా దృష్ట్యా కోర్టు హాలులో ఉన్న కక్షిదారులు, న్యాయవాదులు, సిబ్బందిని హుటాహుటీన బయటకు పంపించారు. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు భయాందోళనలతో కోర్టు ప్రాంగణం నుంచి బయటకు పరుగులు తీశారు.రంగంలోకి బాంబ్, డాగ్ స్క్వాడ్లుసమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కోర్టు ఆవరణను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రతి గది, మూలమూలలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఎవరినీ లోపలికి అనుమతించకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.సైబర్ క్రైమ్ దర్యాప్తుఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ విభాగం సైతం రంగంలోకి దిగింది. ఇది నిజమైన బెదిరింపా? లేక ఆకతాయిల పనినా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *