నెల్లూరు అక్టోబర్ 21 : మన ధ్యాస న్యూస్ :///
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలై కిమ్స్ లో చికిత్స పొందుతున్న, చవలమూడి మేఘన ను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ నెల్లూరులోని కిమ్స్ లో మంగళవారం పరామర్శించారు. వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం, దూబుగుంట గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన, చవలమూడి బాబు, మమత దంపతులు వారి కుమార్తెలు, వైభ, మేఘన, ద్విచక్ర వాహనంపై, కలిగిరికి ఆధార్ నమోదు నిమిత్తం వచ్చి తిరుగు ప్రయాణంలో దూబు గుంట కు వెళుతుండగా, మార్గమధ్యంలోని తెల్లపాడు క్రాస్ రోడ్డు వద్ద, గత బుధవారం సాయంత్రం బోర్ వెల్స్ లారీ ఢీకొనడంతో ప్రమాదంలో చవలమూడీ బాబు, (34)మమత,(27)మరియు వారి కుమార్తె వైభ(8) ప్రమాద సంఘటనలోనే అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. మేఘనకు చేయి నుజ్జు నుజ్జు కావడం తోపాటు తీవ్ర గాయాల పాలయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే ఆత్మకూరులో చికిత్స పొందుతున్న మేఘనకు అత్యవసర చికిత్స అందించాలని నెల్లూరులోని కిమ్స్ వైద్యులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా తెలియజేశారు. హుటాహుటిన ఆత్మకూరు నుండి మేఘనను నెల్లూరుకు తరలించారు. కిమ్స్ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కిమ్స్ లో మేఘనను పరామర్శించి ఎమ్మెల్యే వారి బంధువులతో మాట్లాడుతూ పాపకు అన్ని విధాలుగా అండగా నిలుస్తానని తెలిపారు. ప్రభుత్వం ద్వారా మృతుల కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తానన్నారు. అదేవిధంగా బోర్ వెల్స్ లారీ ద్వారా ఇన్సూరెన్స్ క్లైమ్ చేయించి, ఇన్సూరెన్స్ వచ్చేలాగా చూస్తాను అని తెలిపారు. పాపను జాగ్రత్తగా చూసుకోవాలని బంధువులకు తెలిపారు.








