

- డయల్ 112 ద్వారా వచ్చిన కాల్… వెంటనే స్పందించి బాల్య వివాహాన్ని ఆపిన పోలీసులు.
- బాల్యం అంటే స్వప్నాలు నెరవేర్చే వయస్సు, బాధ్యతల బరువు మోసే వయస్సు కాదు.
- బాల్య వివాహాలను నివారించు, ప్రతీ ఆడబిడ్డ భవిష్యత్తు నిర్మించు. కత్తి శ్రీనివాసులు, బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్.
బంగారుపాళ్యం డిసెంబర్ 4 మన న్యూస్ :- బంగారుపాళ్యం పోలీసులకు డయల్ 112 ద్వారా వచ్చిన ఒక హెల్ప్ లైన్ కాల్, ఒక ఆడపిల్ల జీవితాన్ని కొత్త వెలుగుల్లోకి తీసుకొచ్చింది. వేంకటగిరి గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువతి స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతుండగా, తనను అదే గ్రామానికి చెందిన 26 ఏళ్ల వ్యక్తితో వివాహం చేయాలని ఆమె తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు అనే సమాచారం పోలీసులకు అందింది. బాల్య వివాహం గురించి విషయం తెలుసుకున్న బంగారుపాలెం పోలీసులు అప్రమత్తమై బంగారుపాలెం ఇన్స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు వేంకటగిరి గ్రామానికి చేరుకున్నారు. బాల్య వివాహాన్ని అరికట్టేందుకు వారి కర్తవ్యాన్ని చిత్తశుద్ధిగా నిర్వర్తించారు, సదరు వివాహాన్ని చట్ట ప్రకారం ఆపేశారు.అనంతరం ఇరు కుటుంబాల పెద్దలను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ ఇస్తూ… * అమ్మాయికి ఈ వయసులో వివాహం జరగడం ఎంతో ప్రమాదకరమని, ఇది చట్టవిరుద్ధమని వివరించారు. బాల్య వివాహాలు ఆడబిడ్డల భవిష్యత్తుపై ఎంతటి ప్రతికూల ప్రభావం చూపుతాయో తెలియజేశారు. ముఖ్యంగా, చదువుకుంటున్న వారు చదువులో మెరుగు పడితే, వారికి మంచి జీవితానికి బాటలు వేసుకునే అవకాశాలు ఉంటాయని ఉద్ఘాటించారు.* ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకున్న చట్టాలను, బాల్య వివాహాలపై ఉండే కఠినమైన శిక్షలను కుటుంబ సభ్యులకు వివరించారు. బాలల హక్కులు రక్షించడమే కాదు, వారి భవిష్యత్తు కోసం వారికి తగిన సమయంలో విద్యా అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని సవినయంగా గుర్తుచేశారు.* అబ్బాయి తరపున వారికి కౌన్సిలింగ్ ఇస్తూ బాల్య వివాహ నిరోధక చట్టం, 2006 (ప్రోహిబిషన్ అఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ , 2006) ప్రకారం, 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న అమ్మాయిని వివాహం చేసుకోవడం నేరం. ఈ చట్టం కింద ముద్దాయికి 2 ఏళ్ల జైలు శిక్ష లేదా రూ. 1 లక్ష వరకు జరిమానా, లేదా రెండూ విధించబడవచ్చు. పోక్సో చట్టం, 2012 (ప్రొటెక్షన్ అఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫన్సెస్ యాక్ట్ ): మైనర్ బాలికతో శారీరక సంబంధం ఉంటే నేరంగా పరిగణించబడుతుంది, భౌతిక సంబంధం వివాహం ద్వారా జరిగినా ఇది కఠినమైన నేరమే. ఈ చట్టం కింద కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధించబడవచ్చునని వివరంగా తెలియజేసారు.సమాచారం అందిన వెంటనే స్పందించి బాల్య వివాహాన్ని అడ్డుకొని 16 సం.ల బాలిక భవిష్యత్తు అంధకారం కాకుండా ఆమె జీవితంలో వెలుగులు నింపిన బంగారుపాలెం ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీస్ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా నివారించేందుకు, జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పాఠశాలలు మరియు ఇతర ప్రాంతాల్లో బాల్య వివాహాలపై అవగాహన పెంచేందుకు సదస్సులు, కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే మహిళా పోలీసులతో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.తమ ప్రాంతాలలో బాల్య వివాహాలు లేదా ఏ ఇతర చట్ట వ్యతిరేఖ కార్యకాలాపాలు జరిగిన వెంటనే దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇవ్వండి లేదా డయల్ 112 లేదా చిత్తూరు పోలీస్ వాట్సాప్ నెంబర్ 9440900005 కు సమాచారం అందించాలని చిత్తూరు జిల్లా పోలీసు వారి మనవి.