

బంగారుపాళ్యం డిసెంబర్ 1 మన న్యూస్
బంగారుపాళ్యం మండలం మంగళపల్లి పాఠశాలలో విద్యార్థులచే నడపబడుతున్న పాఠశాల సంచిక ‘మంగళ విద్యావాణి’31వ సంచికను పాఠశాల ప్రధానోపాధ్యాయిని రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ,ఈ సంచికకు దాతృత్వం వహించిన ‘అమృత భారతి ఫౌండేషన్’వ్యవస్థాపకులు ప్రకాష్ రెడ్డి మరియు ప్రముఖ అవధాని ఆముదాల మురళి గార్ల చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెచ్చిన ఈ ప్రత్యేక సంచికలో విద్యార్థులు తమ తోటి విద్యార్థుల వ్యక్తిత్వాలు , గుణ గణాల గురించి అభిప్రాయాలను తెలుపుతూ వ్యాసాలు రాయడం జరిగింది. ఈ సందర్భంగా అవధాని ఆముదాల మురళి మాట్లాడుతూ పిల్లలు రాసిన వ్యాసాలన్నీ చక్కగా ఉన్నాయని ప్రశంసించారు. విద్యార్థులు సోమరితనం, వాయిదా వేయడం లాంటి అంతర్గత శత్రువులను జయించినప్పుడే గొప్ప విజయాలు అందుకోగలుగుతారని సందేశమిచ్చారు. దాత ప్రకాష్ రెడ్డి గారు 9మరియు 10 వతరగతుల విద్యార్థులకు ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్ అంశంపై సూచనలు ఇచ్చి భవిష్యత్ లో చదువు కోర్స్ ల గురించి మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పిల్లల కోరిక మేరకు ముందుగా వారు అడిగిన వివిధ పుస్తకాలు తన సొంత నిధులతో కొని విద్యార్థులకు ఉచితంగా అందించారు. పుస్తక పఠనం సంపూర్ణజ్ఞానాన్నిస్తుందని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గణిత ఉపాధ్యాయులు, అవధాని అరుణ శివప్రసాద్, ఉపాధ్యాయులు రమాదేవి, సంజీవి, పిల్లారప్ప, సంపంగి, శ్రీనివాసులు,ధన శేఖర్, మోహన్ రెడ్డి, భారతి లు పాల్గొన్నారు.