

జై భీమలింగ,ఓం నమ:శివాయ నామస్మరణతో మార్మోగిన గడేకల్
ఉరవకొండ, మన న్యూస్: విడపనకల్ మండలపరిధిలోని గడేకల్ గ్రామంలో వెలసిన
శ్రీభీమలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన మహారథోత్సవ వేడుక శనివారం జరిగింది. వేదమంత్రోచ్ఛరణతో,వివిధ కళానృత్యాల నడుమ,డప్పువాయిద్యాలతో శ్రీవేములవాడ భీమలింగేశ్వర స్వామి మహారథోత్సవ కార్యక్రమన్ని మఠం పూజారులు,గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో భక్తుల కోలాహలం మధ్య శనివారం సాయంత్రం అంగరంగవైభవంగా జరిగింది.రథోత్సవ కార్యక్రమానికి ముందు భక్తులు,గ్రామ ప్రజలు పెద్దఎత్తున హాజరై స్వామివారి ఉత్సవమూర్తులను దర్శనం చేసుకొని,స్వామివారికి ప్రీతికరమైన వివిధ వంటకాలను నైవేద్యంగా సమర్పించి,భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.రథోత్సవం సందర్భంగా విడపనకల్ ఎంపీపీ కరణం పుష్పావతి భీమిరెడ్డి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేకువజామున ఉచ్చాయము లాగారు.మహారథోత్సవాన్ని వీక్షించడానికి అనంతపురం,కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటక,తెలంగాణ,మహారాష్ట్రల నుండి భక్తులు వేలాదిసంఖ్యలో రావడంతో మహారథోత్సవ వేడుక జనసంద్రంగా మారి వైభవంగా జరిగింది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బృందం గట్టి బందోబస్తు నిర్వహించారు._