

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్ : అనుమతికి మించిన బరువులు, వాటిని లాగలాక ఒరిగిపోతున్న టిప్పర్ లారీలు, రోడ్డుపై ఎవరున్నా నాకేంటి అంటూ నడుపుతున్న వాహన డైవర్లు, బలవుతున్న మనుషులు, జంతువులు నిత్య పోరాటాలు ప్రజా సంఘాలు, ఎన్నో ఫిర్యాదులు షరతులు మాకు వర్తించవు అంటూ కోట్ల రూపాయలు క్యాష్ చేసుకుంటున్నా గ్రావెల్ మాఫియాదారులు… రాజకీయ నాయకులు అధికారులకు ముడుపులు అందుతున్నాయంటూ ప్రజలు ఆరోపణలు… ప్రత్తిపాడు నియోజకవర్గం చివర రెండు మండలాలలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి నెలకొంది…తాజాగా మరొక ఘటన చోటుచేసుకుంది… మండల కేంద్రం శంఖవరం మీదుగా తిరుగుతున్న భారీ టిప్పర్ల వల్ల రోజు రోజుకు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం ఒక్క రోజే స్థానిక పాత స్టేట్ బ్యాంకు వీధిలో ఒక టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో విద్యుత్ స్తంభం రెండు ముక్కలు కాగా, విద్యుత్ తీగలు టిప్పర్పై పడిపోయాయి. దీనితో గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ వెంటనే పరారయ్యాడు. మరో ప్రమాదం కుసుమంచి రాయలు వారి సందులో టిప్పర్కు దారి ఇచ్చే సమయంలో గూడ్స్ ఆటో పల్టీ కొట్టింది. దీంతో సామాన్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. నెల్లిపూడి శివారులో శంఖవరం హై స్కూల్ నుండి బైక్ పై పిల్లలను తీసుకెళ్తుండగా బండరాళ్లను తరలించే టిప్పర్ స్వల్పంగా ఢీ కొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న పిల్లలు స్వల్ప గాయాలు కాగా, టిప్పర్ అదుపుతప్పి రోడ్డు పక్కకు పోయి చెట్టును ఢీకొట్టింది. ఇదే విధంగా ప్రతిరోజు జరుగుతున్న ప్రమాదాలతో టిప్పర్ల వల్ల వాహన చోదకులు బాటసారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పాఠశాలకు వెళ్లే, వచ్చే సమయాల్లో టిప్పర్లను నిలుపుదల చేయాలని విద్యార్థులు మొర పెట్టుకున్నప్పటికీ పెడచెవిన పెడుతున్నారు. ఈ రహదారిలో తిరుగుతున్న టిప్పర్లును నిలుపుదల చేసే శక్తి వీరికి లేదా అంటూ సామాజిక కార్యకర్త మేకల కృష్ణ, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులకు టిప్పర్ల రాకపోకలపై మేకల కృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలు ప్రజలకు కూటమి ప్రభుత్వంపై గల నమ్మకాన్ని వమ్ము చేస్తుందని, ప్రజల ప్రాణాల కంటే లాటరైట్, గ్రావెల్, బండరాళ్ల ఎగుమతులే అధికార పార్టీ నేతలకు ముఖ్యమా అంటూ ప్రజలు నిందిస్తున్నారు. ఇప్పటికే రహదారులు చిధ్రమై కూటమి ప్రభుత్వం ఏడాదిలో వేసిన రహదారులన్నీ శిధిలస్థితికి చేరుకుంటుండడంతో ఈ ప్రాంత వాసులు గగ్గోలు పెట్టుచున్నారు. అధికారుల్లారా ఇప్పటికైనా ఈ రహదారిలో తిరుగుచున్న టిప్పర్లపై చర్యలు తీసుకుని, శంఖవరంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏపీ మోడల్ స్కూల్ కి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు టిప్పర్ లారీలు వేగం తగ్గించాలని అవసరమైతే ఆ సమయం అప్పుడు టిప్పర్ లారీలు నిలుపుదల చేయండని ప్రజలు వేడుకుంటున్నారు.