

పూతలపట్టు (అమరావతి )నవంబర్ 18 మన న్యూస్
తమిళనాడు రాష్ట్ర వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని చిత్తూరు జిల్లా ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాల్లో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గళం విప్పారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ * పూతలపట్టు నియోజకవర్గంలోని అనేక సమస్యలతో పాటుగా ఇతరత్రా అనేక అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. ఈ అసెంబ్లీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. పూతలపట్టు – నాయుడుపేట, చిత్తూరు – బెంగళూరుకు సంబంధించి నేషనల్ హైవే రోడ్డు ఏపి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో వచ్చిందని పేర్కోన్నారు. ఐతే జాతీయ రహదారుల అధికారుల నిర్లక్ష్యం మరియు టెక్నికల్ మేజర్స్ తీసుకుపోవడం కారణంగా పూతలపట్టు నియోజకవర్గంలోని మొగిలి ఘాట్ వద్ద వారానికి 2 లేక మూడు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియజేశారు. ముఖ్యంగా జగమర్ల క్రాస్ నుండి చిత్తూరు వరకు జరుగుతున్న ప్రమాదాలు చూస్తే ప్రయాణికులను, స్ధానికులను భయాన్ని కలిగిస్తుందన్నారు. ప్రమాదాల నివారణ కోసం నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తూ, అదేవిధంగా శ్రీవారి దర్శనానంతరం తిరిగి ప్రయాణం అవుతూ ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. 2019 – 20 సం” లెక్కల ప్రకారం 691 ప్రమాదాలు జరిగితే, అందులో 363 మంది చనిపోగా, 826 క్షతగాత్రులుగా అయ్యారని, 2020 – 21 సం” లెక్కల ప్రకారం 659 ప్రమాదాలు జరిగితే, 273 మంది మృతి చెందగా, 749 మంది క్షతగాత్రులు, 2021 – 22 సం” లెక్కల ప్రకారం 733 ప్రమాదాలు జరిగితే, 320 మంది మృత్యువాత పడగా, 807 మంది క్షతగాత్రులు, 2022 – 23 సం” లెక్కల ప్రకారం 771 ప్రమాదాలు జరిగితే 366 మంది మృత్యువాత పడగా, 790 మంది క్షతగాత్రులు, ఇక 2023 సం” లెక్కల ప్రకారం సుమారుగా 387 మంది రోడ్డు ప్రమాదాలతో చనిపోవడం జరిగిందని వివరించారు. ఇక రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో అత్యవసరమైన వైద్యం అందుబాటులో లేకపోవడం, నాణ్యత ప్రమాణాల విషయంలో కొన్ని నిర్లక్ష్యం కారణంగా వందలాది మంది ప్రాణాలు విడుస్తున్నట్లు తెలిపారు. అయితే బంగారుపాళ్యం, పి.కొత్తకోట, పూతలపట్టులో ట్రామా కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయడం ద్వారా వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని, దీనిపై ఆయా శాఖ తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. మరి ముఖ్యంగా చిత్తూరు జిల్లా నుండి 70 శాతం మంది తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు సిఎంసి ఆసుపత్రికి వెళ్తున్నారని, సీఎంసీలో ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని, ఆరోగ్య శ్రీ వర్తింపజేసినట్లైతే పేద ప్రజలు మెరుగైన వైద్యం పొందే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సీఎంసీలో ఆరోగ్య శ్రీ కార్డు వర్తింప చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలను దగా చేయడం కోసం ఓటిఎస్ పధకంను ప్రవేశ పెట్టి లక్షలాది మంది ఎస్సీల దగ్గర నుండి డబ్బులు కట్టించుకుని మోసం చేయడం జరిగిందన్నారు. ఒక్క చిత్తూరు జిల్లాలో 48 వేల మంది డబ్బులు కట్టారని, ఈ ఓటిఎస్ పధకంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు కోరారు.